ఇసుక తోడేందుకు వెళ్లి...
నర్సాపూర్ వాగు గుంతలో చిక్కుకొని వ్యక్తి మృతి
ఉట్నూర్, ఆగస్టు 3: ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ వాగు గుంతలో పడి ఇంద్రవెల్లి మండలానికి చెందిన ముండే విట్టల్(38) మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఉట్నూర్ ఎస్త్స్ర గుమ్మల విజయ్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన గణేష్ తన ట్రాక్టర్ తో ఆదివారం సాయంకాలం వాగులో ఇసుకను తోడేందుకు ఇద్దరు కూలీలతో జైత్రం తండా సమీపంలోని నర్సాపూర్ వాగులో ఇసుక తోడుతున్నారు. ఈ క్రమంలో ముండే విట్టల్ నీటిలో ఇసుకను తోడేందుకు వాగులోకి వెళ్లారు. వాగులో ఉన్న గుంతను గమనించక పడిపోయాడు.
ఈత రాని విట్టల్ గుంతలో పడిపోయాడు. రక్షించండి అంటూ చేతులు పైకెత్తి లేపి చూపినా ఆయన వెంట వెళ్లిన ఇద్దరూ రక్షించలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇసుక కోసం వెళ్లిన విట్టల్ తో పాటు మరో ఇద్దరికి ఈత రాదని జైత్రంతాండవాసులు తెలిపారు. వాగులో మునిగిపోయిన విట్టల్ మృతదేహాన్ని గజ ఈత గల సహాయంతో పోలీసులు వెలికి తీయించారు. ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయినట్లు విట్టల్ అన్న బాబు ముండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.






