6 July, 2026 | 1:53 AM

రూ.21 కోట్లతో కంసాన్‌పల్లిలో పశు వీర్య ఉత్పత్తి కేంద్రం ప్రారంభం

06-07-2026 12:40 AM

షాద్నగర్ ఇందిరమ్మ ఇళ్లకు రూ.325 కోట్లు: మంత్రి వాకిట శ్రీహరి

షాద్ నగర్, జూలై 5 (విజయక్రాంతి): ఫరూఖ్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు వినియోగంలోకి రాని పశువుల ఘనీకృత వీర్య నాలికల (ఫ్రోజన్ సీమెన్ స్ట్రా) ఉత్పత్తి కేంద్రాన్ని రూ.21 కోట్లతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాలాభివృద్ధి, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకిట శ్రీహరి స్పష్టం చేశారు.

ఆదివారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తో కలిసి మంత్రి ఈ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు కేంద్రం భవిష్యత్ కార్యాచరణను మంత్రి, ఎమ్మెల్యేలకు వివరించారు.

పాల ఉత్పత్తిలో తెలంగాణను ముందంజలో నిలుపుతాం

మంత్రి వాకిట శ్రీహరి మాట్లాడుతూ, కరీంనగర్ తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ప్రతిష్టాత్మక కేంద్రం కంసాన్పల్లిలోనే ఉందన్నారు.మేలు జాతి పశువుల ఉత్పత్తిని పెంచి, రైతులకు అధిక పాల దిగుబడినిచ్చే పశువులను అందుబాటులోకి తేవడం. దేశంలో పాల ఉత్పత్తిలో తెలంగాణ ప్రస్తుతం 13వ స్థానంలో ఉందని, ఈ వెనుకబాటుతనాన్ని మార్చేందుకు కంసాన్పల్లి కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. అవసరమైన సిబ్బంది నియామకం, మౌలిక వసతులపై అధికారులు నివేదిక సమర్పించిన వెంటనే కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకలోకి తెస్తామన్నారు. 

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, రూ.21 కోట్లతో ఈ కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి సుమారు 10 లక్షల మేలు జాతి పశువుల ఉత్పత్తికి అవసరమైన ఘనీభవించిన వీర్య నాలికలను తయారు చేసే సామర్థ్యం ఏర్పడుతుందని, ఇది రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు.అన్నారంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం..

నియోజకవర్గానికి రూ.325 కోట్లు ఫరూఖ్నగర్ మండలం అన్నారం గ్రామంలో గిరిజన మహిళ నేనావత్ జ్యోతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి వాకిట శ్రీహరి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై, సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారురాలి కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘షాద్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు రూ.325 కోట్ల నిధులు ఖర్చు చేస్తోంది.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి  పేర్కొన్నారు.  కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, ఆర్డీవో ఎన్.ఆర్. సరిత, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ చప్లా నాయక్, డిప్యూటీ ఇంజనీర్ సురేష్, ఏఈ సాయినాథ్, ఎమ్మార్వో నాగయ్య, ఎంపీడీవో శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్ శ్రీనివాస్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.