అభివృద్ధి చేస్తూ ప్రజా పాలన సాగిస్తున్నాం..
- ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నాలు...
- మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి
చెన్నూర్, జూలై 5 : కాంగ్రెస్ హయాంలో అన్ని రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మండల కేంద్రంలో మురుగు కాలువ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని, 143 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించామని, అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు జారీ చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో రూ. 36 కోట్లతో 56 కిలోమీటర్ల మేర రహదారులు, రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 63 కోట్లతో రహదారులు నిర్మించడం జరుగుతుందని, భీమారం మండల పరిధిలో 6 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టామన్నారు.
అమృత్ 2.0 పథకం క్రింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నిరంతరం త్రాగునీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నియోజక వర్గంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. చెన్నూర్ పట్టణంలో రహదారి విస్తరణలో వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, కోటి 60 లక్షల డీఎంఎఫ్టి నిధులతో బైపాస్ రోడ్డు నిర్మించడం జరుగుతుందని, కోటి 20 లక్షలతో నిర్మిస్తున్న 20 షాపులలో పేద వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇచ్చి కేటాయించడం జరుగుతుందన్నారు.
అనంతరం చెన్నూర్ కిష్టంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు నిర్మించుకున్న ఇంటిని జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి ప్రారంభించారు. పెంకుటిల్లు లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండే విధంగా ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుందని, పెంకుటిల్లు గల అర్జీదారులు చేసుకున్న దరఖాస్తును మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పరిశీలించి ఫోటోలు తీసుకుని అర్హత ప్రమాణాలు పరిశీలించి ఇల్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా అరికట్టడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.






