సావధానంగా విని.. సమస్యకు పరిష్కారం చూపి..
మహబూబాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించి, వారి సమస్యను సావధానంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలిస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ బాధితులకు ఊరటనిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన భూ సంబంధ ఫిర్యాదులపై గూగుల్ మీట్ ద్వారా భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ లకు ఆదేశాలిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ప్రతి కార్యాలయంలో పెండింగ్ ఫైల్లు వెంటనే క్లియర్ చేయాలి, కార్యాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కలెక్టర్ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు.




