22 May, 2026 | 2:56 AM

మక్కలు, జొన్నపై సీలింగ్ ఎత్తివేయండి

22-05-2026 12:11 AM

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ను కోరిన రాష్ట్ర మంత్రి తుమ్మల 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి) :  రాష్ట్రంలో మక్కజొన్న, జొన్న పంటల కొనుగోళ్లకు విధించిన పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కోరారు.  గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.  ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో మక్కజొన్న, జొన్నలు దాదాపు 20.29 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. సుమారు 47.23 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉన్నదని తెలిపారు.

దిగుబడి అంచనాకు తగినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 11.45 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని, అయినా మార్కెట్‌లకు ఇంకా దిగుబడుల ఒత్తిడి పెరుగుతూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీలింగ్ ఎత్తివేసి మక్కజొన్న మరో 14.90 లక్షల మెట్రిక్ టన్నులు, జొన్న 2.01 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు కూడా గణనీయంగా పెరిగిందని,  కేంద్రం కేవలం 3,690 మెట్రిక్ టన్నుల సేకరణకే అనుమతి ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మసాగునీటి పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్, పండ్ల తోటలు, కూరగాయల సాగు, ఆయిల్ పామ్ సాగుకు ప్రాధాన్యమిస్తుందని, ఇందుకోసం రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.16 లక్షల హెక్టార్లలో 79,448 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 2026 -27 సంవత్సరానికి మరో 34,000 హెక్టార్ల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. క్రూడ్ పామాయిల్‌పై  దిగుమతి సుంకాన్ని మళ్లీ 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.