18 June, 2026 | 2:11 AM

గ్రామీణ యువతకు స్థానికంగానే ‘ఐటీ’ అవకాశాలు కల్పించాలి

18-06-2026 12:00 AM

అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వికేంద్రీకరణ ద్వారానే ప్రతి ప్రాంతానికి చేరాలి

ములుగులో ఐటీ రంగ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం 

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క

ములుగు (మహబూబాబాద్) జూన్ 17 (విజయక్రాంతి): ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో కొత్త భవిష్యత్తుకు దారులు వేయాలని రాష్ట్ర పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరిగితేనే మారుమూల ప్రాంతాల యువతకు సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ గత ఒక సంవత్సరం కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ, యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా యాప్లను అభివృద్ధి చేసి వివిధ పాఠశాలలు, సంస్థలు, ఐటీ రంగానికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తు తం సంస్థలో సుమారు 15 మంది యువత ఐటీ రంగంలో ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు.

హైదరాబాద్ వంటి నగరాలకు మాత్రమే ఐటీ పరిశ్రమలు పరిమితం కాకూడదని, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో కూడా ఐటీ రంగం విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి సాంకేతిక యుగంలో ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశాలు ఉన్నాయని, అభివృద్ధి, ఉద్యోగాల వికేంద్రీకరణ ద్వారానే సమాజంలో సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ములుగు జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకులు రవికుమార్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మెగా జాబ్ మేళా

ములుగు జిల్లా ఇంచర్ల ఎం ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన మెగా జాబ్ మేళా 2026 కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా మెగా జాబ్ మేళాల ద్వారా యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించుకునే అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.

జిల్లాలోని యువత అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఏ ఎస్ పి మనన్ భట్, పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్, మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, సంబధిత అధికారులు పాల్గొన్నారు.