ఏటీఎం మోసగాళ్లు అరెస్ట్
24 గంటలలో కేసును ఛేదించిన పోలీసులు
కూకట్‌పల్లి, జూన్ 17 (విజయక్రాంతి ): ఏటిఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మోసగాళ్లను బుధవారం కేపిహెచ్‌బి పోలీస్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేపిహెచ్‌బి పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం వడ్డే కాటమయ్య (25), పల్లపు శ్రీనివాసులు (48) జల్సాలకు అలవాటు పడి నేరలు చేసి పలు కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారు. సంగారెడ్డి జైల్లో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో ఒకరికి ఒకరికి జైల్‌లో పరిచయం ఏర్పడింది.
నిందితులు ఇద్దరు కేపిహెచ్‌బికాలనీలో నివాసం ఉంటూ ఏటిఎంలలో నగదు తీసుకుంటున్న వినియోగదరుల పట్ల మోసాలకు పాల్పడుతున్నారు. పల్లపు శ్రీను ఏటిఎం బయట కాపుకాసేవాడని, వడ్డే కాటమయ్య ఏటిఎం కేంద్రంలోపటికి వెళ్లి ఏటిఎం నుండి నగదు బయటకు వచ్చే భాగంలో పారదర్శకమయినా షీట్‌ను అమర్చే వాడు. వినియోగదారుడు నగదును ఉపసంహరించుకునే సమయంలో వాళ్లు అమర్చిన షీట్ నగదు బయటకు రాకుండా అడ్డు పడేది.
వినియోగదారుని ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చేది. ఏటిఎం లోపం కారణంగా నగదు రాలేదని భావించిన వినియోగదరుడు వేల్లిపోయేవాడు. అది గమనించిన కాటమయ్య లోపలికి వెళ్లి ఆషీట్‌ను తొలగించి డబ్బులను ఏటిఎం నుండి బయటకు తీసుకొని ఇద్దరు పరారు అయే వాళ్ళు. భాధితులు బ్యాంక్ అధికారులను సంప్రదించి పిర్యాదు చేసే వారు, బ్యాంక్ అధికారులు పరిశీలించి సంబంధించిన మొత్తాన్ని పిర్యాదు దారుల ఖాతాలో జమ చేసే వారు.
ఈనెల 7వ తేదీన కెపిహెచ్‌బి 9వ ఫేసులో యూనియన్ బ్యాంక్ ఎటిఎంలో ఇదే తరహా మోసం జరిగింది. దీంతో యూనియన్ బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా సిసి ఫుటేజ్ లను, సాంకేతిక ఆధారాల సహాయంతో ఫిర్యాదు చేసిన 24 గంటలలో నిందితులను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు ఉపసంహరించుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నగదు లభించని ఎడల బ్యాంక్ అధికారులను గాని పోలీసులకు గాని సమాచారం అందించాలని కూకట్ పల్లి ఏసిపి రవి కిరణ్ రెడ్డి సూచించారు.






