15 March, 2026 | 4:03 AM

మూసీని మురికికూపంగా మార్చింది.. ముమ్మాటికి కాంగ్రెస్సే

15-03-2026 02:04 AM

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్

ముక్కు  నేలకురాసి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపం కడుక్కోవాలి

ఇది సుందరీకరణ కాదు.. భూముల ఆక్రమణ పథకం

  1. ఆరు గ్యారెంటీలకు డబ్బుల్లేవంటూనే మూసీ అభివృద్ధికి రూ. 1.5 లక్షల కోట్లా?
  2.   3,300 ఎకరాల భూమి, రూ. 1.5 లక్షల కోట్లపై రేవంత్‌రెడ్డి కన్ను 
  3. ప్రాజెక్టులో అవినీతిని, ఇండ్ల కూల్చివేతను అడ్డుకుంటాం: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : మూసీ నదిని మురికికూపంగా మార్చిందే ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, దశా బ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వా ల పాలన ఫలితంగానే మూసి సర్వనాశనం అయిందన్నారు.

గతంలో మూసిని మురికికూపంగా మార్చిన పాపానికి ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని రేవంత్‌కి హితవు పలికారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నది మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదని, భూముల ఆక్రమణ పథకమని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు, అభివృద్ధికి డబ్బులు లేవు, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్‌రెడ్డి మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతా అంటున్నారని, లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

శనివారం రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం పా యింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ ప్రజెంటేషన్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ. 16,000 కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధంచేసిందని, ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కిలో మీటర్ల మేర విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు.

అయి తే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల అంచనాలతో సా మాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎలాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు లేకుండా, సోష ల్ ఇంఫాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా వేలమంది ఇండ్ల ను కూలగొడతామని ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభు త్వం భూసేకరణ చట్టాలు, ఇతర నిబంధనలను అన్నింటినీ పాతర వేసి వేలకోట్ల అవినీతికి తెగబడుతున్నదని విమర్శించారు. అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు అని, అవినీతికి కాంగ్రెస్ పార్టీ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకమని కేటీఆర్ అన్నారు. కచ్చితంగా రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటామని, పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటా మని భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు పణంగా పెట్టి వందల ఉద్యమాలు చేసి సాధించుకున్న భూమి పుత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎదుర్కొంటామని కేటీఆర్ తెలిపారు. బాధితుల వెంట కచ్చితంగా బీఆర్‌ఎస్ ఉంటుందని, ప్రతి ఒక్క ప్రాంతానికి పార్టీ నేతలు పార్టీ శ్రేణులు వచ్చి మరి నిలబడతామన్నారు. ఒక రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు సమిష్టిగా కలిసికట్టుగా ప్రభుత్వం పైన పోరాడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి ప్రతి ఒక్కరి ఇళ్లను భూములను కాపాడుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

గాంధీ పేరుతో.. 

అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకి వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతు కు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె చందంగా రేవంత్ రెడ్డి తీరు తయారైందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూ ములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి వివరించారని మండిపడ్డారు.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ హోటల్లో రేవంత్ రెడ్డి పీపీటీ ఇస్తే, మూసీని ఎలా అభివృద్ధి చేయవచ్చో బాధితులతో కలిసి బాధితుల పక్షాన మేము వివరిస్తున్నామని తెలిపారు. వందల కిలోమీటర్ల నమామి గంగేకు ఖర్చు కేవలం 42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే మా ప్రశ్నకు రేవంత్‌రెడ్డి సమా ధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమని, కానీ కేవలం మూసీ పేరు తో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ను దోచుకుంటామంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యవహారం చూస్తుంటే మూసీ కోసం కాకుం డా, మూసీ పక్కన ఉన్న భూముల కోసం పనిచేస్తున్నారని, రేవంత్ రెడ్డి స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పేమిటి అని అంటున్నారని గుర్తు చేశారు.

గాంధీ విగ్రహం పెడతా అంటున్న రేవంత్ రెడ్డి, గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ.. ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నా రు. ఎవరు అడ్డుకోవద్దనే పథకంతోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

పెద్దల ఇళ్లకు బఫర్ జోన్ వర్తించదా?

వరద నీటిని అడ్డుకోవడం కోసం ఎస్‌ఎన్డీపీ అనే ఒక ప్రత్యేక పథకాన్ని కూడా కార్య క్రమాన్ని కూడా ప్రారంభించామని, దీంతోపాటు మూసీలో చెక్ డ్యాములు, మూసీ పైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడంతోపాటు వాక్ వేలు, సైక్లింగ్ ట్రాక్లు పార్కులను గత ప్రభుత్వ ప్రణాళికలో పొందుపరిచామని గుర్తు చేశా రు. వీటన్నింటికీ సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాకు వచ్చిన అంచనా వ్య యం కేవలం 16,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి లక్షల కోట్ల రూపాయల ఖర్చు మూసీ పైన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని, కేవలం డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉన్నది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వాళ్ళ సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్ హౌస్‌లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా ఎందుకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లను, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోనని చెబుతున్నారని, ఇప్పుడు బఫర్ జోన్‌లో ఉన్న వాటిని కూలగొట్టి తిరిగి అవే బఫర్ జోన్‌లో భారీ భవనాలు కడతా అంటున్నారని ఎద్దేవా చేశారు. 

పేదల ఇళ్ల పునాదులపై..

మూసీ అంశంలో మా పార్టీది మానవీయ కోణంలో అభివృద్ధి చేసే కార్యక్రమమని స్పష్టం చేశారు. మూసీలో ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా నాగోల్ వద్ద అభివృద్ధితోపాటు బేగంపేట, గండిపేట వంటి అనేక చోట్ల అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామని, కానీ ఎలాంటి పని చేయకుండానే మూసీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ప్రచారం చేసుకుంటున్నదన్నారు.

ప్రజల ఇళ్లను కూగొట్టాలని మా పార్టీ ఏనాడు మూసి అభివృద్ధి ప్రణాళికలో భావించలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇండ్లను కూలగొట్టి మూసి ప్రణాళికను తయారుచేసిందన్నారు. ప్రజల ఇండ్లను కూల్చి వాటి పునాదుల పైన మూసి ప్రాజెక్టు కట్టడం అన్యాయమని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సూచన మేరకు ఇల్లు కూల్చకుండా మూసిని ఎలా అభివృద్ధి పరచవచ్చో ప్రయత్నం ప్రారంభించామని, ఒక ఇంటర్నేషనల్ డిజైన్ కాంపిటీషన్ పెట్టి ప్రజలకి నష్టం లేకుండా మూసిని అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

మూసీ అభివృద్ధిలో భాగంగా మూసీకి ఓఆర్‌ఆర్ నుంచి ఓఆర్‌ఆర్ వరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంతో పాటు, మూసీలో మురికిని మొత్తం తీసివేసేలా ఎస్టీపీల నిర్మాణాన్ని కోసం ప్రణాళిక రూపొందించి, ఆ మేరకు 3,800 కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని, వీటిని నిర్మాణం పూర్తుయితే ఒక్క చుక్క కూడా మురికి నీరు మూసి లోకి చేరదని వివరించారు.

దీంతోపాటు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని ప్రణాళిక సిద్ధం చేశామని, దానికోసం కేవలం 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తీసుకు వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి అనేక రెట్లు అంచనాలు 10 వేల కోట్లకి పెంచి రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా కరప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

3,300 ఎకరాలపై రేవంత్‌రెడ్డి కన్ను..

కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,300 ఎకరాల భూమి పైన కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారని, ఈ మొత్తం భూముల విలువ రూ.1.5 లక్షల కోట్లు అని, వాటి కోసమే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారని ఆరోపించారు. ఒక్క డిజైన్ చేసే కంపెనీకే రూ. 160 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ఇచ్చారంటే ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు.

మూసీ బాధితుల ఇళ్లకు జీరో విలువ ఉందని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగవద్దని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు రాష్ట్రంలో ఎవరికైనా జీరో విలువ ఉన్నది అంటే అది ముమ్మాటికీ రేవంత్ రెడ్డికే అని కేటీఆర్ అన్నారు. కేవలం ఒకటి రెండు అపార్ట్‌మెంట్ వాసులకు ఇళ్లు కట్టించి తగిన స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి, అదే సూత్రం అదే న్యాయం అందరు బాధితులకు వర్తింపజేస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు.

రేవంత్ రెడ్డికి తన కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంతో అనే అంశం పైన అవగాహన కూడా లేదని, ఎవరికీ నష్టం లేకుండా మూసీని అభివృద్ధి చేసే గత ప్రభుత్వ ప్రణాళిక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదని, దాన్ని చూసి తక్కువ ఖర్చుతో మూసీని అభివృద్ధి చేయవచ్చన్నారు. కేవలం రూ. 16,000 కోట్లతో 57 కిలోమీటర్ల మూసీని అభివృద్ధి చేయవచ్చని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రణాళికను ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మూసీ బాధితులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలపైన ఆందోళన ఆగ్రహం వ్యక్తంచేస్తూ పలు సలహాలు సూచనలు ఇచ్చారు. దశాబ్దాల నుంచి స్థిరపడి జీవనం సాగిస్తున్న మా బతుకులను ఆగం చేయవద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు విప్ వివేకానంద గౌడ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొని బాధితుల పక్షాన నిలిచారు.