వాహనం ఢీకొని బాలుడి మృతి
డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించిన స్థానికులు బీజేపీ, స్థానికుల ధర్నా
ముషీరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): తల్లితోపాటు టిఫిన్ చేసేందుకు వెళ్తున్న బాలుడిని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పారిపోతున్న డ్రైవర్‌ను స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, వీటిని నివారించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీనితో స్వల్ప ఉద్రిక్తత, గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భోలక్ పూర్‌కు చెందిన మహేష్ గౌడ్ సంతోషి దంపతులు.. వారికి కుమారుడు శ్రీయాన్స్ (4), కూతురు లతిక ఉన్నారు. శనివారం ఉదయం తల్లితోపాటు శ్రియాన్స్ భోలక్ ప్పూర్లోని గంగపుత్ర సంఘం కమ్యూనిటీ హాల్ నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఓ ఆటో అడ్డుగా వస్తున్నది. వాహనాన్ని గమనించిన సంతోషి బాబును తీసుకుని పక్కకు వెళ్తుండగా డ్రైవర్ అయూబ్ నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం ముందు టైర్ల కింద పడి శ్రీయాన్స్ మృతి చెందాడు. డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరిగెత్తుతుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. సీఐ రాజ్ గోపాల్ రెడ్డి, ఎస్త్స్ర లక్ష్మినారాయణలు ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని సీజ్ చేసి శ్రీయాన్స్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






