ఉద్యోగులకు ‘బీమా’ భరోసా
- రూ.1.5 కోట్ల వరకు కవరేజీ
- కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు,పెన్షనర్లకూ వర్తింపు
- చర్యలు చేపట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం అందించేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కింద రూ.1కోటి నుంచి రూ.1.5 కోట్ల వరకు కవరేజీ లభించనుంది.
అంతేకాకుండా విమాన ప్రమాద బీమా కింద కొన్ని బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చాయి. ప్రమాదాల కారణం గా శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా బీమా ప్రయోజనాలు అందేలా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉద్యోగి అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రక్షణ కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఇప్పటి వరకు జీతాల ఖాతాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకింగ్ సేవలను బీమా, భద్రతా ప్రయోజనాలతో అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగుల సంక్షేమా నికి కొత్త భరోసా కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఇతర తాత్కాలిక ఉద్యోగులు, పెన్షనర్లను కూడా ఇందులో భాగస్వాములను చేయడం.
దీంతో లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు అదనపు రక్షణ లభించనుంది. యూనియ న్ బ్యాంక్, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, యూకో బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు తమ ప్రతిపాదనలు సమర్పిం చాయి.
ఉద్యోగుల కోసం అధిక బీమా కవరేజీ, మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకుల మధ్య పోటీ నెలకొనడం విశేషంగా మారింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది ఒక ఆర్థిక రక్షణ కవచంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు : తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నందుకు తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపింది. ఈ పథకం అమలులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, పాల్గొనే బ్యాంకుల మధ్య గురువారం జరగనున్న అవగాహన ఒప్పంద మహోత్సవాన్ని స్వాగతించింది.
ఈ సందర్భంగా తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్య దర్శి బీ శ్యామ్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ, ఈ మహత్తర కార్యానికి పూనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ఉన్నతాధికార బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.






