25 June, 2026 | 3:00 AM

కాలేజీల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి

25-06-2026 12:37 AM
  1. ఇంజనీరింగ్ బి కేటగిరి సీట్లు కౌన్సిలింగ్‌తో భర్తీ చేయాలి
  2. లక్షలు వసూలు చేసే కళాశాలలను సీజ్ చేయాలి
  3. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్నాయని, ఇంజనీరింగ్ విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చుకున్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌లు ఆరోపించారు. యాజమాన్యకోట సీట్లను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటూ విద్యను వ్యాపారంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ ఉన్న కోర్సుల్లోని సీట్లకు ఇష్టానుసారంగా  ఫీజులు పెంచుతున్నారని ఆరోపించారు.

సీట్లను బ్లాక్‌లో పెడుతూ మెరిట్ విద్యార్థులకు ఇవ్వకుండా లక్షల రూపాయల ఫీజులు కట్టేవారికి ఇస్తున్నారని మండిపడ్డారు. కొన్ని కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో వాటికి అడ్మిషన్ల కొరత సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు రాబడుతున్నారని విమర్శించారు. పేదవారికి ఇంజనీరింగ్ విద్య అందనిద్రాక్షగా మారుతుందని ఆరోపించారు. కళాశాలలు యాజమాన్య సీట్ల భర్తీల్లో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.

అధికారులకు తనిఖీలకు వెళ్లే ముందు మాత్రం తాత్కాలికంగా టీచింగ్  సిబ్బందిని నియమించుకొని లేని సౌకర్యాలను ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆరోపించారు. తనిఖీల అనంతరం షరామామూలే అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు.

విద్యాశాఖను తన చేతిలో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు. టీఏఎఫ్ ఆర్సీ నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేసే కళాశాలలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. అనేక కాలేజీలు ఫీజులపై ప్రశ్నిస్తే, నిలదీస్తే బౌన్సర్లను పెట్టుకొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఇలాంటి కాలేజీలపై ఉక్కుపాదం మోపి వెంటనే గుర్తింపు రద్దు చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌లు డిమాండ్ చేశారు.