27న మెగా జాబ్ మేళా
టీఆర్‌ఎల్డీ ఆధ్వర్యంలో హనుమకొండలోని కిట్స్ కాలేజీలో ఏర్పాటు
టీఆర్‌ఎల్డీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ వెల్లడి
హనుమకొండ, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్‌కుమార్ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేళాలో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన 100కు పైగా సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పారు. వరంగల్ పరిసర జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న), మాజీ ప్రొఫెసర్ వెంకటనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. నాగరాజు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితర ప్రముఖులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వివరాల కోసం 9542632975, 9640503757, 8978907134 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
అదేవిధంగా, అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో ‘లక్ష్యం కోసం లక్ష సైన్యం‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్‌ఎల్డీ అధికార ప్రతినిధి గౌర బీరప్ప మాట్లాడుతూ.. నల్లగొండ, - వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎల్డీ తరఫున కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎల్డీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్, టీఆర్‌ఎల్డీ యువజన విభాగం అధ్యక్షులు రాఙ్ కుమార్ రెడ్డి, టీఆర్‌ఎల్డీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బుల్లెట్ వెంకన్న, టీఆర్‌ఎల్డీ రాష్ట్ర కోశాధికారి గిరి కుందే, రాష్ట్ర కార్యదర్శి కోటి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు.






