30 July, 2026 | 2:03 AM

జమ్మిగడ్డ పీహెచ్‌సీ తనిఖీ

30-07-2026 12:51 AM

నిర్వహణపై డీఎంహెచ్‌వో సీరియస్

మౌలిక వసతుల లోపాలపై ఆగ్రహం

ఉప్పల్, జూలై 29 విజయక్రాంతి: కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో నెలకొన్న సమస్యలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి చేరడంతో డీఎంహెచ్వో డాక్టర్ ఆనంద్ బుధవారం ఆకస్మికంగా ఆసుపత్రిని సందర్శించారు.

పీహెచ్సీలో పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి సమస్యలు, టాయిలెట్ల దుస్థితి, రోగులకు సరైన సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలను స్వయంగా పరిశీలించిన ఆయన పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రి ఆవరణ, వార్డులు, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరును పరిశీలించిన డీఎంహెచ్వో సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్ల మరమ్మతులు, రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు పీహెచ్సీ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ తనిఖీ చేపట్టినట్లు సమాచారం. డీఎంహెచ్వో పర్యటనతో జమ్మిగడ్డ పీహెచ్సీ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.