30 July, 2026 | 2:03 AM

ఒరిజినల్ సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి

30-07-2026 12:52 AM

ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్

ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): తెలంగాణలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థుల ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీ), మెమోలు, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లను వివిధ కారణాలతో నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ఇప్పటికే సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటి అమలుకు సమర్థమైన వ్యవస్థ లేకపోవడంతో అనేక కళాశాలలు ఆదేశాలను పట్టించుకోవడం లేదన్నారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ లేదా ఆన్లైన్ ఫిర్యాదు పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత కళాశాలలపై విచారణ జరిపి, పెండింగ్లో ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని నేరుగా విద్యార్థులకు అందజేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అలాగే బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను అక్రమంగా నిలిపివేసే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవన్ విజ్ఞప్తి చేశారు. దీంతో విద్యార్థుల హక్కులు పరిరక్షించబడటంతో పాటు విద్యా వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.