‘సర్’తో పథకాలకు సంబంధం లేదు
- ఆగస్ట్ 3లోగా వందశాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
- వందశాతం పూర్తయిన సీఈవోలకు ప్రశంసలు
- తప్పులుంటే అధికారులపై చర్యలు తప్పవు
- ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ (సర్) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితా సవరణకు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ కేవలం తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేందుకు మరో ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నందున ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100శాతం పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 76శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, గ్రామీణ ప్రాంతాల్లో 90శాతం పూర్తయిందని, ఇందులో ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హజూర్‌నగర్, నర్సంపేట్, వర్ధన్నపేట్, పరకాల, బోద్ నియోజకవర్గాల్లో 100శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన అధికారులను సిఇఒ ప్రశంసించారు.
శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్‌ఎంసితో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాలలో డిజిటలైజేషన్ ప్రక్రియపై సంబంధిత డిఇఒలు ప్రత్యేక దృష్టి సారించి డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలను డిజటలైజేషన్ చేయడంలో ఓటరు పేర్లను తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. ఓ టర్లలో మరణించిన వారు, ఇండ్లు మా రిన వారి వివరాలు, అందుబాటులో లేని వారి (ఎ.ఎస్.డి) జాబితాను సిద్ధం చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఎల్‌ఎల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.






