2 May, 2026 | 1:20 PM

లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం

02-05-2026 12:22 PM

దమ్మపేట, మే 02 (విజయ క్రాంతి):  శనివారం ఉదయం 11:46 ని.లకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో సైరన్ మోగింది. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారతదేశం, తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి, తమ పౌరుల కొరకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక సేవ గురించి సెల్ బ్రాడ్‌కాస్ట్‌ను ప్రారంభించింది అప్రమత్త మైన పౌరులు, సురక్షితమైన దేశం. ఈ సందేశాన్నిస్వీకరించన తర్వాత ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదు.

ఇది ఒక పరీక్షా సందేశం-భారత ప్రభుత్వం, అనే సందేశంతో పెద్ద శబ్దం చేసుకుంటూ సైరన్ మోగింది. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం 'సాచెట్' (SACHET_ అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.

 దీనివల్ల లాభం ఏంటంటే 

ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరుతుంది. వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్ లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.