వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా
తూకం లేక రోజులు గడుస్తున్నాయని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్..
సిద్దిపేట రూరల్, మే 2: సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ చౌరస్తా వద్ద రైతులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. పెద్ద లింగారెడ్డిపల్లి, రాఘవాపూర్, రావురూకుల గ్రామాలకు చెందిన రైతులు తమ వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆరోపిస్తూ, జాప్యం కారణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి రోడ్డుపై నిల్చొని రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కష్టపడి పండించిన పంటకు సరైన సమయంలో కొనుగోలు జరగాలని, మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బట్టు భాస్కర్ రెడ్డి, బట్టు తిరుపతి, గ్యార పద్మ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బరిగేల నర్సింలు, లింగాల జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






