10 July, 2026 | 4:18 AM

ముస్మిలో అక్రమ టేకు దుంగల స్వాధీనం

10-07-2026 01:33 AM

విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అటవీ శాఖ

మహబూబాబాద్, జూలై 9 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలపై అటవీ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు..విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో గూడూరు అటవీ అభివృద్ధి అధికారి, కొత్తగూడ అటవీ పరిధి అధికారి ఆధ్వర్యంలో సెక్షన్ అధికారులు, బీట్ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఓ ఇంటిని సోదా చేయగా సుమారు 68 టేకు దుంగలు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న టేకు దుంగలను కొత్తగూడ రేంజ్ కార్యాలయానికి తరలించి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే అందిన సమాచారం మేరకు మరికొన్ని అనుమానాస్పద ఇళ్లలో కూడా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయని,

అక్రమంగా నిల్వ ఉంచిన మరిన్ని టేకు దుంగలు గుర్తిస్తే వాటిని కూడా స్వాధీనం చేసుకుని అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కొత్తగూడ రేంజ్ అధికారి వంశీకృష్ణ  వెల్లడించారు..అటవీ సంపదను పరిరక్షించేందుకు అక్రమ కలప రవాణా, నిల్వలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు కూడా అక్రమ అటవీ కార్యకలాపాలపై సమాచారం అందించి శాఖకు సహకరించాలని కొత్తగూడ రేంజ్ అధికారి వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.