ఫీజు బకాయిలను చెల్లించాలి
- లేదంటే రాష్ట్రంలో అగ్నిగుండమే
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
- హిమాయత్‌నగర్‌లో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ
ముషీరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.10 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని, స్కీమును యధాతధంగా అమలు చేయాలని కోరారు. బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని ఆయన హెచ్చరించారు.
బుధవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ తిరుగుబాటు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ .. బకాయిలు విడుదల చేయకపోతే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. బీసీలకు మంత్రివర్గంలో, నామినేట్ పోస్టులలో, బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త స్కీం కూడా బీసీలకు పెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి రద్దుల ముఖ్యమంత్రిగా చరిత్ర కెక్కుతాడన్నారు. పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారని, ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసే కుట్ర కాకుండా 23 వేల ప్రభుత్వ పాఠశాలను రద్దు చేస్తామని బహిరంగంగా సీఎం ప్రకటించడం అత్యంత దారుణమన్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ళ సతీష్
కుమార్, బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు జి. అనంతయ్య, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్యులు రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివ కుమార్ యాదవ్, చిక్కుడు బాలయ్య, నిమ్మల వీరన్న, వంశీ మోహన్, నరేష్ గౌడ్ లతో పాటు వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.






