14 March, 2026 | 4:30 AM

ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణా ఔట్

14-03-2026 12:00 AM

ముంబై, మార్చి 13: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా ప్లేయర్ హర్షిత్ రాణా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యా డు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు సౌతాఫ్రికాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో హ ర్షిత్ రాణా మోకాలికి తీవ్రంగాయమైంది. దాంతో చివరి నిమిషంలో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 9న ముంబైలో హర్షిత్ రాణా మోకాలికి సర్జరీ జరిగింది.

ఈ సర్జరీ కారణంగా అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉండాలని రాణా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా హర్షిత్ రాణా స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. హర్షిత్ రాణా గైర్హాజరీ కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలవడంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో అతను 19 వికెట్లు పడగొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అతన్ని కేకేఆర్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోగా.. 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఇప్పటివరకైతే కేకేఆర్ హర్షిత్ రాణా ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఆకాశ్ దీప్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగిలో ఒకరిని ఎంచుకోనుంది. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌కు శ్రీలంక స్పీడ్ స్టార్ మతీషా పతిరాన సైతం గాయం కారణంగా దూరమయ్యే అవకాశముంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో పతిరాన ను రూ.18 కోట్లకు కేకేఆర్ సొం తం చేసుకుంది. కానీ టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా పతిరాన కూడా గాయపడ్డా డు. అతడు ఇంకా శ్రీలంకలోనే ఉన్నాడు. ఇక ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ ముస్తాఫిజుర్ రెహ్మ న్ స్థానంలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని కేకేఆర్ జట్టులోకి తీసుకుంది.