తప్పిపోయిన బాలుడి అప్పగింత
ఎస్సై వెంకటేశ్వర్లు
నారాయణపేట. జులై 5(విజయక్రాంతి): నారాయణపేట పట్టణంలోని మెయిన్ చౌక్ సెంటర్ వద్ద ఆదివారం ఒక 8 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి దారి తెలియక తిరుగుతుండగా, అప్రమత్తమైన ఏఆర్ కానిస్టేబుల్ కనకప్ప బాలుడిని గుర్తించి నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. పోలీసులు బాలుడిని వివరాలు అడిగినా అతను స్పష్టంగా చెప్పలేకపోవడంతో, బాలుడి ఫోటోను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.
దీంతో ఆ బాలుడు గురుమిట్కల్కు చెందిన ఎండి ఆయాన్ అలీ, తండ్రి ఆయాజ్ అలీ కుమారుడిగా గుర్తించి వెంటనే బాలుడి తండ్రికి సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించగా, ఆయన నారాయణపేట టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తన కుమారుడిని గుర్తించారు. అనంతరం పోలీసులు బాలుడిని తండ్రికి క్షేమంగా అప్పగించారు.ఈ సందర్భంగా బాలుడిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఏఆర్ కానిస్టేబుల్ కనకప్పను బాలుడి తండ్రి కృతజ్ఞతలు తెలిపాగా, స్థానికులు అభినందించారు. ప్రజలు తమ చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టవద్దని టౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సూచించారు.






