6 July, 2026 | 2:20 AM

‘సర్’ ప్రక్రియలో వేగం పెంచండి

06-07-2026 12:17 AM

డీసీసీ చీఫ్ శివసేనారెడ్డి

వనపర్తి, జూలై 5 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్  ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల, పట్టణ అధ్యక్షుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆయా మండలాలు, పట్టణాల్లో ఎన్యూమరేషన్ ఫారాల భర్తీ పురోగతి, ఇంటింటి ప్రచారం, ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎదురవుతున్న సమస్యలపై  చర్చించారు. ప్రతి బూత్ పరిధిలో పార్టీ నాయకులు, బీఎల్‌ఏ-2లు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు చేపట్టాలని శివసేనారెడ్డి సూచించారు. ఫారాల భర్తీ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే జిల్లా పార్టీ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.

పార్టీ కార్యకర్తలు సర్ ప్రక్రియను బాధ్యతగా తీసుకుని ప్రతి బూత్లో సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నడుస్తున్న సర్ కార్యక్రమంలో ప్రతి ఒక్క బిఎల్‌ఏ -2 సభ్యులు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, వివిధ మండల, వనపర్తి, పెబ్బేర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పలువురు  కార్యకర్తలు పాల్గొన్నారు.