బోనాలకు గోల్కొండ ముస్తాబు
వైభవంగా మెట్ల పూజ నిర్వహణ
బొట్లు పెట్టేందుకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు గోల్కొండ ముస్తాబయింది. ఉత్సవాల్లో మొదటి ఘట్టమైన మెట్ల పూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బొట్లు పెట్టేందుకు వచ్చిన మహిళలతో గోల్కొండ వద్ద కోలాహలం నెలకొంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన మెట్లన్నింటినీ పసుపు నీటితో శుభ్రం చేసి, పసుపు- కుంకుమలతో బొట్లు పెట్టి, పూలతో ముగ్గులు వేశారు.
ప్రతి మెట్టునూ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మెట్ల పూజ అనంతరం మహిళలు శిరస్సున బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో, మంగళహారతుల పాటలతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.






