15 July, 2026 | 2:12 AM

మాజీ మంత్రి ముద్రగడ కన్నుమూత

15-07-2026 12:00 AM

అనారోగ్యంతో చికిత్స పొందుతూ సింధు ఆసుపత్రిలో తుది శ్వాస

1978లో జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు 

2024 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరిక 

బలమైన కాపు ఉద్యమ నేతగా గుర్తింపు

హైదరాబాద్, జూలై 14(విజయక్రాంతి): ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(73) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముద్రగడ రెండుసార్లు మంత్రిగా, కాకినాడ ఎంపీగా పని చేశారు. అలాగే కాపు ఉద్యమ నేతగా కూడా ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఉంది. వారిది రాజకీయ కుటుంబం. ముద్రగడ పద్మనాభం తండ్రి వీర రాఘవరావు 1962, 1967లో రెండు సార్లు ప్రత్తిపాడులో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అలాగే తాతయ్య పద్మనాభం మున్సుబ్‌గా పని చేశారు. తండ్రి చనిపోయిన తర్వాత భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటిసారి 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పద్మనాభం జనతా పార్టీ అభ్యర్ధిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1978 నుంచి 1989 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ పద్మనాభం ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ముద్రగడ 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ముద్రగడ మంత్రిగా పనిచేశారు.

అనంతరం మంత్రి పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసిన ముద్రగడ పద్మనాభం ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను స్థాపించారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన ఆ సామాజిక వర్గ రిజర్వేషన్ల కోసం దీక్ష చేశారు. 2016లో తునిలో కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలవకపోతే తన పేరు ముద్రగడ పద్మనా భరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించిన ఆయన.. కూట మి విజయం తర్వాత ఇకపై నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ ప్రకటించిన విషయం విదితమే.

పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖుల సంతాపం

ముద్రగడ పద్మనాభం కన్నుమూశారని తెలియగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, అభిమానులు, కాపు సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు,  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ముద్రగడ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారన్నారు.

ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడని, ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన కృషి గొప్పదని అన్నారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.