బాలికలదే హవా
ఇంటర్ రిజల్ట్స్ విడుదల
- ఫస్ట్ ఇయర్‌లో 66.20%, సెకండ్ ఇయర్‌లో 70.58% ఉత్తీర్ణత
ఫస్ట్ ఇయర్‌లో మేడ్చల్, సెకండ్ ఇయర్‌లో భూపాలపల్లి జిల్లాలు టాప్
ప్రైవేట్ కంటే గురుకుల కాలేజీల్లోనే మెరుగైన ఫలితాలు
997 మార్కులతో ఎంపీసీ సెకండ్ ఇయర్ టాపర్ తీగల సాయిశ్రేష్టిత
బైపీసీ సెకండ్ ఇయర్‌లో 997 మార్కులతో హఫ్సాబేగం, కొయ్య జ్యోత్స్న టాప్
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజు చెల్లింపునకు 20 వరకు గడువు
మే 13 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): ఇంటర్ ఫలితాల్లో ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జనరల్, వొకేషనల్ కలిపి మొత్తం 4,89,123 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీరిలో 3,23,807 (66.20) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 2,49,110 మంది బాలికలు పరీక్షలు రాయగా, 1,85,331 (74.40 శాతం) మంది విద్యార్థులు, బాలురు 2,40,013 మంది పరీక్షలకు హాజరుకాగా, 1,38,475 (57.69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 5,07,948 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే, 3,58,490 (70.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇందులోనూ బాలికలు 2,54, 050 మంది పరీక్షలు రాయగా, 1,99,813 (78.65 శాతం) మంది పాసయ్యారు. ఇక బాలురు 2,53,898 మందికిగానూ 1,58,677 (62.50 శాతం) మంది పాసయ్యా రు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం లో ఆదివారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్య, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయి ఫలితాలను విడుదలచేశా రు. ఈ సందర్భంగా కే కేశవరావు మాట్లాడుతూ.. పరీక్షల్లో పాస్, ఫెయిల్ సహజమని, ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని సూచించారు.
మేధస్సు పెంపొందించుకునేలా విద్యార్థుల చదువులుండాలని చెప్పా రు. ప్రైవేట్ కాలేజీల కంటే రెసిడెన్షియల్ కాలేజీల్లోనే అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. భవిష్యత్‌లోనూ విద్యార్థులంతా వారి ఉన్నత విద్యలో రాణించాలని, వారి జీవితాల్లో అత్యున్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించిన అధ్యాపకులకు, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించిన ఇంటర్ బోర్డు ఉన్నతాధికారు లు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. యోగితా రాణా మాట్లాడుతూ..
ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు మిడ్ డే మీల్స్‌ను 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 16 ఎయిడెడ్ కాలేజీల్లో ప్రారంభిం చామని, ఇందుకు రూ.70 కోట్లను కేటాయించి నట్టు వివరించారు. బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా పాలు, రాగి జావాను కూడా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు 56కోట్లను కేటాయించినట్టు తెలిపారు. డిజిటల్ విద్యకు రూ.34.93 కోట్లను కేటాయించినట్టు, రూ.100 కోట్ల తో కాలేజీల్లో తరగతి గదులు, టాయిలెట్స్, మౌలికసదుపాయాలను కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ముఖగుర్తింపు హాజరుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు.
చివరి స్థానంలో మహబూబాబాద్, సిరిసిల్ల
ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 77.02 శాతంతో మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలవగా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి (75.69 శాతం), తృతీయ స్థానంలో జయశంకర్ భూపాలపల్లి (72.19 శాతం) జిల్లా నిలిచింది. చివరి స్థానంలో మహబూబాబాద్ (48.1 శాతం) జిల్లా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 81.95 శాతంతో టాప్‌లో జయశంకర్ భూపాలపల్లి ఉండగా, ద్వితీయ స్థానంలో ములుగు (81.68 శాతం), తృతీయ స్థానంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ (80.57 శాతం) జిల్లా నిలిచింది. చివరిస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా (55.68 శాతం) నిలిచింది.
టాప్‌లో సర్కారు కాలేజీలే..
సర్కారు జూనియర్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీల కంటే మెరుగైనా ఫలితాలను సాధించాయి. గురుకుల కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. ప్రైవేట్‌లో ఫస్టియర్ 69.99 శాతంకాగా, సెకండియర్ 71.57 శాతం నమోదైతే, 94.03 శాతంతో టీఎస్‌ఆర్జేసీ మొదటి స్థానంలో నిలిచాయి. టీజీఎస్‌ఆర్టీసీ కాలేజీ 89 శాతం ఉత్తీర్ణతతో ద్వితీయస్థానంలో నిలిచింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీలు ఫస్టియర్ శాతం, సెకండియర్‌లో 86.79 శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లో 42.49 శాతం, సెకండ్ ఇయర్‌లో 59.86 శాతం నమోదైంది.
అత్యధికంగా ఏ గ్రేడ్‌లో పాస్
విద్యార్థులు అత్యధికంగా ఏ (75 శాతం పైన) గ్రేడ్‌లోనే ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 2,10,380 మంది ఏ గ్రేడ్‌లో పాసవగా, బీ గ్రేడ్ (60 నుంచి 75 శాతం)లో 75,096 మంది, సీ గ్రేడ్ (50 నుంచి 60 శాతం)లో 28,062 మంది, డీ గ్రేడ్ (35 నుంచి 50 శాతం)లో 10,269 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లోనూ ఏ గ్రేడ్‌లో 2,33,299 మంది, బీ గ్రేడ్‌లో 79,957 మంది, సీ గ్రేడ్‌లో 23,318 మంది, డీ గ్రేడ్‌లో 5,452 మంది ఉత్తీర్ణులయ్యారు.
టాప్ స్కోర్ 997..
ఎంపీసీ, బైపీసీలోనూ టాప్ స్కోర్ 997గా ఉంది. సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1,000 మార్కులకు హనుమకొండ జిల్లాకు చెందిన తీగల సాయి శ్రేష్టిత 997 మార్కులతో టాప్‌లో నిలిచింది. సెకండ్ ఇయర్ బైపీసీలో 1,000 మార్కులకు హైదరాబాద్ జిల్లాకు చెందిన హఫ్సాబేగం, ఖమ్మం జిల్లాకు చెందిన కొయ్య జ్యోత్స్న 997 మార్కులతో టాప్‌లో నిలిచారు.
మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
నెల రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్న ట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులతో కలిసి తదుపరి విద్యను కొనసాగించేలా పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఈమేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదలచేసింది. మే 13 నుంచి 21 వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫీజు చెల్లింపునకు ఈనెల 13 నంచి 20 వరకు అవకాశం ఇచ్చారు. ఇంటర్ పరీక్ష ఫలితాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అడ్వాన్స్‌డ్ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూ పరీక్షలను మే 26న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మే 28న నిర్వహిస్తారు. ఈ పరీక్షలను రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. ఆదివారం అనుకున్న సమయం ఉదయం 11 గంటల కంటే ఐదు నిమిషాలు ముందే ఫలితాలను విడుదలచేశారు.





