‘జెన్‌జీ’ ప్రభంజనం
నేపాల్ రాజకీయ యవనికపై సరికొత్త రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత తరం రాజకీయ నాయకత్వాన్ని, అవినీతిమయమైన వ్యవస్థను అక్కడి ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఈ విషయంలో ‘జెన్‌జీ’ తరం మరింత పట్టింపుగా ఉంది. దీనిలో భాగంగానే వారు తాజా సార్వత్రిక ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్పీ)కి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. శనివారం రాత్రి వరకు విడుదలైన ఫలితాల్లో ఆ పార్టీని ముందంజలో ఉన్నట్లు తేలింది.
ష్టమవుతున్నది. ఇవన్నీ ఆ దేశ రాజకీయాల్లో మార్పులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి. 2022లో జరిగిన ఖాఠ్మాండు నగర ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బాలేంద్ర షా, తర్వాత మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. మేయర్‌గా ఆయన ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఇదే ఒరవడిలో ఇప్పుడు దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించే దిశగా పయనిస్తున్నారు. ఇది కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.
నవ తరం ఆకాంక్షల విజయం. గతేడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో జరిగిన పరిణామాలు రాజకీయ మార్పులకు పునాది వేశాయి. ‘జెన్‌జీ’ తరం అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. సోషల్ మీడియాను వేదిక చేసుకుని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దలుగా ఉండి, విలాసవంతమైన జీవనం గడుపుతున్న వారి ఇండ్లపై దాడులు చేసింది. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తప్పుపడుతూ, ఉవ్వెత్తున వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేపట్టింది.
పారదర్శకమైన పాలన, స్వదేశంలోనే ఉపాధి అవకాశాలు, వారసత్వ రాజకీయాలకు ముగింపు, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన జవాబుదారీతనం ఉండాలనే బలమైన ఆకాంక్షలతో యువత ఈ పోరాటాన్ని సాగించింది. పోరాటంలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది యువతీ యువకులు పాల్గొన్నారు. జరిగిన నిరసనల ఫలితంగా అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం పడిపోయింది.
ఆ పరిణామం నేపాల్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. పాత పార్టీల పట్ల నెలకొన్న అసహనం జెన్‌జీ తిరుగుబాటులో ప్రతిబింబించింది. సంప్రదాయ రాజకీయ పార్టీల పద్ధతులను కొత్త తరం పూర్తిగా పక్కనపెట్టింది. ఇప్పుడు వారు పాలనలో పారదర్శకతను కోరుకుంటున్నారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వారు రాపర్, మేయర్ అయిన బాలెంద్ర షాకు మద్దతు ఇస్తున్నారు. నారాదేవి ప్రాంతానికి చెందిన బాలేంద్ర షాకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టం. క్రమంగా ఆయన ర్యాపర్‌గా ఎదిగారు.
అభిమానులు ఆయన్ను ముద్దుగా బాలెన్ షాగా పిలుస్తుంటారు. ఆయన తండ్రి ఆయుర్వేద వైద్యుడు. బాలేంద్ర షా ఎదుగుతున్న క్రమంలో వీరి కుటుంబం ఖాఠ్మాండుకు వచ్చి స్థిరపడింది. బాలేంద్ర షా భారత్‌లోని ఓ వర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. తర్వాత స్వేదేశానికి వచ్చి ర్యాపర్‌గా జెన్‌జీ తరాన్ని ఆకట్టుకున్నారు. ఈ తరం ఆయన్ను నాయకుడిగా చూడలనుకుంటున్నది. ఇలాంటి తరుణంలో నేపాల్- భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ మొదలైంది. కొత్త పాలకులు ‘జెన్‌జీ’ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా.. అనేది ఇక ముందు తేలాల్సి ఉంది.




