సామాన్యులపై నిత్యావసర ధరల భారం
పశ్చిమాసియాలోని యుద్ధం, దుష్ప్రభావాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర దేశాలపైనా పాడుతున్నది. నిత్యావసర ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరిగి ప్రతి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్నది. ప్రపంచీకరణ కాలంలో భౌగోళిక రాజకీయాలు ఎంతలా పెనవేసుకుపోయాయనేది చెప్పేందుకు ఇరాన్- మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే నిదర్శనం.
ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి పశ్చిమాసియాలో అస్థిరత ఏర్పడితే, అది అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలను పెంచేస్తుంది. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో, ఈ ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాయంటే.. అది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు, రవాణా ఖర్చులు పెరగడం వల్ల రైతు పొలంలో పండే కూరగాయ నుంచి నిత్యావసర వస్తువుల వరకు ప్రతీది ఖరీదవుతుంది.
అంతర్జాతీయ శక్తి సంస్థ, ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి చమురు ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల భారత ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రిజర్వ్ బ్యాంక్ నివేదికలు సైతం హెచ్చరిస్తున్నాయి.
మరోవైపు, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన రెడ్ సీ మార్గం ప్రమాదంలో పడటం వల్ల భారత్ నుంచి యూరప్‌కు వెళ్లే సరుకు రవాణా ఆగిపోతున్నది. నౌకలు సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం వల్ల ప్రయాణ సమయం 10 నుంచి 15 రోజులు పెరగడమే కాకుండా, యజమానులపై బీమా ప్రీమియాల భారం కూడా భారమవుతున్నాయి. ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్రాలు, పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ధరలు పెరిగి, చివరికి ఆ భారం సామాన్య వినియోగదారుడిపైనే పడుతున్నది.
ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో పెట్టుబ డిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆశ్రయంగా భావించడం వల్ల పసిడి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ, పసిడి ధరల పెరుగుదల అత్యంత ప్రభావం చూపిస్తున్నది. మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఈక్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చమురు దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకోవడం, వ్యూహాత్మక చమురు నిల్వలను సమర్థంగా వినియోగించడం, అవసరమైతే పన్ను సడలింపుల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపట్టాలి. అదే సమయంలో, దీర్ఘకాలికంగా పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి.
యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ సిద్ధాంతం కోసం జరిగినా, చివరికి దాని భారాన్ని మోసేది మాత్రం సామాన్య ప్రజలే. అందుకే అంతర్జాతీయ సమాజం యుద్ధం కంటే దౌత్య పరిష్కారాలకు, శాంతి మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పశ్చిమాసియాలో మేఘాలు విడిపోయి శాంతి నెలకొంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుంది. భారతీయుడి వంటింట్లో మళ్లీ నిశ్చింత ఏర్పడుతుంది. యుద్ధం ఆగిపోవడమే నేడు ప్రపంచానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన పరిష్కారం.
శ్రీనివాసరావు, హైదరాబాద్




