ఓటు హక్కును కాపాడుకోండి
ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు వెంటనే ఇవ్వండి
గడువు మరో పది రోజులే ఉంది
సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అందజేసిన ఎన్యూరేషన్ ఫారాలను వెంటనే పూర్తిచేసి బీఎల్‌ఓలకు వెంటనే అందజేసి మీ ఆమూల్యమైన ఓటుహక్కును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు.
బీఎల్‌ఒలు అందజేసిన ఫారాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పూరించి, పాసుపోర్టు సైజ్ పోటోను అతికించి బీఎల్‌ఒలకు అందించాలని సీఈవో మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్యూమరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఓటర్ సంతకం, తేదీతో పాటు బీఎల్‌ఓల సంతకం ఉండేలా చూసుకోవాలని సూచించారు. బీఎల్‌ఓలు ఓటర్లకు అందజేసిన రెండు ఎన్యూమరేషన్ ఫారాల్లో ఒకటి బీఎల్‌ఓలకు ఇవ్వాలని, మరొకటి ఓటర్ భద్రపరుచుకోవాలని సీఈవో పేర్కొన్నారు.
పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌ఓలకు ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఓటరు పేరు నమోదు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. 2002 ఓటరు జాబితాలో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నింపాలని, ఒకవేళ అటువంటి వివరాలను లేకపోయిన ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలను నింపి బీఎల్‌ఒలకు అందజేయాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610 మంది (49.28%) ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారని తెలిపారు.






