23 April, 2026 | 4:22 PM

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే సండ్ర సంఘీభావం

23-04-2026 03:02 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సంఘీభావం తెలిపారు. సమ్మె ప్రదేశాన్ని సందర్శించిన ఆయన కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. అలాగే ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో జరిగే అనర్థాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు