5 May, 2026 | 2:11 AM

మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు

05-05-2026 12:58 AM

బిజినేపల్లి మే 04  మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదానికి గురై రైతును నిలువునా దహిస్తోంది. నందివడ్డెమాన్, అల్లిపూర్ గ్రామాల్లో ఆదివారం పంట దగ్ధం కాగా సోమవారం ఖానాపూర్, నంది వడ్డెమాన్ గ్రామాల్లోనూ మొక్కజొన్న పంట దగ్ధమైంది. ఖానాపూర్ గ్రామంలో ఈర్ల లక్ష్మమ్మకు చెందిన ఏకరన్నర మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. నంది వడ్డేమాన్ గ్రామంలో మ్యాతరి ఉషాన్నకు చెందిన మొక్కజొన్న పంటను కోసి పొలంలోనే కుప్పగా పోసుకున్నాడు. ఈ రెండు గ్రామాల్లో పక్క పొలం రైతులు తన పొలంలోని పంట అవశేషాలకు నిప్పు పెట్టే క్రమంలో అది పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వ్యాపించింది.

దీంతో కొద్ది రోజులుగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అవుతుంది. బిజినేపల్లి మండల వ్యాప్తంగా రబీలో 18,000 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇప్పటికే 12 వేల ఎకరాల వరకు పంట చేతికి రాగా మిగిలిన పంట ఇంకా పొలంలోనే ఉంది. పక్క పొలాల రైతులు తమ పంట అవశేషాలను దగ్ధం చేసే క్రమంలో పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నష్టపోతున్నారు. పంట కోతలో అగ్ని ప్రమాద ఘటనలపై మండల వ్యవసాయాధికారి కమల్ కుమార్ ను సంప్రదించగా మండల వ్యాప్తంగా ఇంకా 4వేల ఎకరాల వరకు పంట కోయాల్సి ఉందన్నారు. 15 రోజుల్లో పంట పూర్తి స్థాయిలో కోతకు వస్తుందని మొక్కజొన్న ఇతర పంటలను దగ్ధం చేయడం కాకుండా తాము సూచించినట్లుగా చేస్తే తర్వాతి పంటకు ఎరువుగా మారుతుందన్నారు. తద్వారా ఖరీఫ్ లో సాగు చేసే పంటలకు తక్కువ మోతాదులో మాత్రమే కృత్రిమ ఎరువులు ఉపయోగించాల్సి వస్తుందాన్నారు.