ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ అవసరం
గద్వాల, మే 4 : వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు తరచూ కేంద్రాలపై పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యం కొనుగోలు, ఇతర అంశాలపై సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వీసీ అనంతరం మాట్లాడారు.
విజిలెన్స్ అధికారులు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం)లో ఎంట్రీ చేసి సకాలంలో వారికి డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పారసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్, మేనేజర్ విమల, డిఆర్డిఎ ఎపిడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.






