ఇరాన్‌పై భీకర దాడులు
అమెరికా, సౌదీ దాడుల్లో 20 మంది మిలీసియాలు హతం
ప్రతీకారంతో టెహ్రాన్ క్షిపణుల వర్షం
కైరో, జూలై 29: మధ్యప్రాచ్యంలోని అమెరికా బలగాలపై ఇరాన్ బుధవారం తెల్లవారుజామున క్షిపణుల వర్షం కురిపించింది. అదే సమయంలో, పొరుగున ఉన్న ఇరాక్‌లో టెహ్రాన్ మద్దతుగల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియాతో కలిసి భీకర దాడులు చేసింది. ఈ దాడిలో 20 మంది మిలీషియా తిరుగుబాటుదారులు మరణించారు.
మరో 32 మంది గాయపడ్డారు. అమెరికా- దాడుల్లో ఆరుగురు ఇరాన్ సలహాదారులు మరణించారని ఇద్దరు ఇరాకీ మిలీషియా అధికారులు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. మరణించిన యోధులలో ఈ సలహాదారులు కూడా ఉన్నారా లేదా అనేది వెంటనే స్పష్టం చేయలేదు. దీంతో కొన్ని రోజుల సాపేక్ష ప్రశాంతత తర్వాత, మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.
గత రెండు రోజులుగా తమ చమురు కేంద్రాలపై ఇరాకీ మిలీషియాలు డ్రోన్లతో దాడులు చేశాయని సౌదీ అరేబియా ఆరోపించింది. ఇరాకీ మిలీషియాల ఒక గొడుగు సంస్థ మొదట ఈ ఆరోపణలను ఖండించింది. ఇరాన్ మద్దతు ఉన్న మరోబృందం యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు- తాము సౌదీ ఇంధన కేంద్రాలపై దాడి చేశామని తెలిపింది. అమెరికా సైనిక కేంద్రమైన జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై తాము బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐదు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం పేర్కొంది. సౌదీ అరేబియాపై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా, అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు తూర్పు ఇరాక్‌లోని పలు లాజిస్టిక్స్, ఆయుధ స్థావరాలపై దాడి చేశాయని అమెరికా సైన్యం ప్రకటించింది. తాము ‘ఉద్రిక్తతను కోరుకోవడం లేదని, కానీ ఎలాంటి దురాక్రమణకైనా ప్రతిస్పందిస్తామని’ సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.






