‘వందేమాతరం’ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
‘జనగణమన’ గీతం మాదిరి చట్టపరమైన రక్షణ
జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష!
ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్
యాక్ట్ -1971కు కీలక సవరణకు కేంద్రం ప్రతిపాదన
రెండుసార్లు సభ వాయిదా.. ప్రతిపక్ష సభ్యులు వాకౌట్
న్యూఢిల్లీ, జూలై 29: జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమో దం తెలిపింది. విపక్షాల ఆందోళనల మధ్యే సభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా దాన్ని చట్టప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. జాతీయ గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించనున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ నెల 24వ తేదీన ఎగువసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. బుధవారం సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. అంతకుముందు రెండుసార్లు సభ వాయిదా పడింది. వందేమాతరం బిల్లులో భాగంగా చరిత్రాత్మక ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ -1971’ (జాతీయ గౌరవానికి భంగం కలిగించే నిరోధక చట్టం)లో కీలక సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రస్తుతం భారత జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఎలాంటి చట్టపరమైన రక్షణలు అమల్లో ఉన్నాయో.. అవే అత్యున్నత రక్షణలను జాతీయ గేయమైన వందేమాతరానికి కూడా వర్తింపజేయడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ బిల్లుపై సభలో చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై పోలీసులు చేసిన బలప్రయోగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.
డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభ్యులను పదే పదే శాంతించి చర్చలో పాల్గొనాలని కోరినప్పటికీ నిరసనలు కొనసాగాయి. కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అఠావలె బిల్లుపై మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల ఆందోళనల మధ్యే సభ ఈ బిల్లును ఆమోదించింది. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతంతో సహా దేశ జాతీయ చిహ్నాలను అగౌరవపరచడం లేదా అవమానించడా న్ని నేరంగా పరిగణించడం ఈ ప్రతిపాదిత చట్టం ముఖ్య ఉద్దేశం. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవ వేడుకలు ఏడాది పొడవునా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం.
అవమానిస్తున్న కాంగ్రెస్ : కేంద్రమంత్రి నిత్యానందరాయ్
బిల్లుపై సమాధానం ఇస్తూ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ దేశ గౌరవాన్ని- అంటే జాతీయ గీతం ‘వందేమాతరం’ను - అవమానించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేటప్పుడు అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు ‘వందేమాతరం’ను తమ చివరి మాటలుగా పలికిన సందర్భాలను ఆయన ప్రస్తావించారు. ‘వందేమాతరం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను ఎవరూ అర్థం చేసుకోలేరు.. దేశ యువత అంతా గమనిస్తోంది. దేశ ప్రజలు వారికి గుణపాఠం చెబుతారు’ అని పేర్కొన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్‘ (ఏక భారతం, శ్రేష్ఠ భారతం) లక్ష్య సాధనకు ‘వందేమాతరం’ అవసరమని ఆయన పేర్కొన్నారు.
సవరణ బిల్లు కీలక నిబంధనలు
జాతీయ గీతానికి చట్టపరమైన రక్షణను పెంచనున్నారు. అసలు చట్టంలో స్పష్టంగా చేర్చబడని వందేమాతరం గేయానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడం ద్వారా, 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నివారణ చట్టాన్ని సవరించాలని ఈ బిల్లు కోరుతోంది. చట్టంలోని సెక్షన్ 3ను సవరించనున్నారు. ఈ సవరణ, జాతీయ గీతానికి సంబంధించిన నేరాలను చేర్చడానికి చట్టంలోని సెక్షన్ 3లో మార్పులను ప్రతిపాదిస్తుంది.
అధికారిక లేదా బహిరంగ కార్యక్రమాలలో వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించే వ్యక్తులను శిక్షించడం దీని లక్ష్యం. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి శిక్ష పడనుంది. ఈ బిల్లు జాతీయ గీతానికి ఆటంకం కలిగిస్తే కఠినమైన శిక్షలను ప్రతిపాదిస్తుంది. ఈ బిల్లు ద్వారా మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించనున్నారు. పునరావృత నేరాలకు, తప్పనిసరిగా కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించాలని ప్రతిపాదించబడింది.






