30 July, 2026 | 1:54 AM

అర్హులకు ప్రిన్సిపాల్స్‌గా ప్రమోషన్లు ఇవ్వాలి

30-07-2026 01:03 AM
  1. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్ ప్రమోషన్లను వెంటనే చేపట్టాలి
  2. ప్రవీణ్ కుమార్ డిమాండ్

ముషీరాబాద్, జూలై 29(విజయక్రాంతి): రాష్ట్రంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్స్  ప్రమోషన్లను వెంటనే చేట్టాలని, ఇందుకోసం సీనియారిటి లిస్టులో ఉన్న తప్పులను సవరించి అర్హులైన వారికి ప్రిన్సిపాల్ ప్రమోషన్లు ఇవ్వాలని క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ టి ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  2023-24-25 సంవత్సరాలలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రమోషన్లను నిబంధనలకు విరుద్ధంగా జూనియర్లకు ప్రమోషన్లు ఇవ్వడం దారుణమని, వెంటనే వారికి ప్రమోషన్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫేక్ ఏహెచ్‌ఎలను పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ప్రిన్సిపాల్ ప్రమోషన్లు పొందిన వారిపై సమగ్ర విచారణ చేసి వారి ప్రమోషన్లను రద్దు చేయాలనిడిమాండ్ చేశారు.

ఈరకమైన తప్పులకు కారకులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక సంఘ నాయకుడి సహకారంతో రాష్ట్రంలో పెద్ద  మొత్తంలో అవతవకలకు అవకాశం ఇస్తున్న అధికారులు, సంఘ నాయకుడిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ రాజు,  జాయింట్ సెక్రటరీ ఆర్ హెచ్ ఆర్డర్ తదితరులతో పాటు అసోసియేషన్ నేతలు లెక్చరర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.