30 July, 2026 | 1:29 AM

ప్రతిపక్షాల రాద్ధాంతం

30-07-2026 12:05 AM

సీపీఎం ఆఫీస్‌పై దాడిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా

పోలీసుల దాడిని ఖండించిన సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్

న్యూఢిల్లీ, జూలై 29: ఢిల్లీలోని సీపీఎం కార్యాలయంపై విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు జరిపిన దాడి శాంతిభద్రతలో భాగమని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తనను కూడా పోలీసులు అనేకసార్లు అరెస్టు చేశారని నడ్డా స్పష్టం చేశారు.

బుధవారం రాజ్యసభలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ పోలీసుల దాడిని ఖండిస్తూ పలు ప్రశ్నలు సంధిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ నిరసనలో పాల్గొనడమే ఆమె చేసిన ఏకైక తప్పా అని బ్రిట్టాస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసులు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు తాను అక్కడే ఉన్నానని వారిని ప్రశ్నించానన్నారు. 2021లో జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన నిరసనకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉందని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం నిరసనకారుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తుందని బ్రిట్టాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేపీ నడ్డా మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఏ విద్యార్థి అయినా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో తనను కూడా తరగతి గది నుంచి రెండుసార్లు అరెస్టు చేశారని పేర్కొన్నారు. సీపీఎం కార్యాలయంపైకి పోలీసులు వెళ్లడాన్ని ప్రతిపక్షం సంచలనాత్మకం చేసి, రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని నడ్డా ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనల్లో ఐషే ఘోష్ పాల్గొన్నారు.