2 May, 2026 | 5:21 PM

రైతు వారోత్సవాలను విజయవంతం చేయాలి

02-05-2026 04:07 PM

కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్

అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ద్వారా గ్రామీణ అభివృద్ధికి వేగం తీసుకురావాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని బీకే ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రజా పాలన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ పరిష్కారాలు అందించేందుకు ప్రజా పాలన సభలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సభలో గ్రామస్తులు భూమి సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణ పథకాలు, ఉపాధి వంటి అంశాలపై వినతులు సమర్పించగా, వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, స్వయం సహాయక సంఘాల రుణాలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

భవిష్యత్తులో కుటుంబ జీవిత బీమా, విద్యార్థులకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన విస్తరణ, దివ్యాంగులకు వాహనాల పంపిణీ, సహజ సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం వంటి పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. మే 4 నుంచి నిర్వహించే రైతు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని, పంట మార్పిడి, నేల ఆరోగ్యం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా, అవినీతి లేకుండా పథకాలు అర్హులకు చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని, యువత, మహిళలు, రైతులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.