8 May, 2026 | 5:46 PM

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

08-05-2026 04:38 PM

హాజీపూర్, (విజయక్రాంతి) : పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో 63వ జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఆరబోసిన వరి ధాన్యాన్ని తూకం వేయకపోవడం, మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, టీకనపల్లి, హాజీపూర్, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి రహదారిపై బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. ధాన్యం వెంటనే కొనాలని, రైతును కాపాడాలని, కలెక్టర్ వచ్చి న్యాయం చేయాలంటూ నినదించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఇప్పటికే తీవ్ర నష్టపోయిన రైతులు, కొనుగోలు ప్రక్రియలో జాప్యం కారణంగా మరింత ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

అదనపు కలెక్టర్ హామీతో...

హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ ధర్నా వద్దకు  చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ స్వయంగా రావాలి, స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ రైతులు రహదారిపై బీష్మించుకు కూర్చోగా ఎస్సై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చంద్రయ్య ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లగక్కారు. కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే పాడైపోతోందని.. మమ్మల్ని ఆదుకోవాలంటూ కాళ్లపై పడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆవేదనను విన్న అడిషనల్ కలెక్టర్ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రోజుకు కనీసం మూడు నుంచి ఐదు లారీలను పంపించి ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే రైస్ మిల్లర్లు, ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు.

లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా హమాలీలను, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దని, ఆరబెట్టిన తర్వాత ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మొదటి వారం రోజులు సాంకేతిక కారణాలతో జాప్యం జరిగినప్పటికీ ఇకపై కొనుగోలు ప్రక్రియ వేగవంతం అవుతుందని భరోసా ఇచ్చారు. రైతులు కూడా ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.అడిషనల్ కలెక్టర్ హామీతో కొంత ఊరట చెందిన రైతులు చివరికి తమ నిరసనను విరమించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ నిరసనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇరువైపులా మూడు   కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.