రైతులు నేల సంరక్షణ, ఎరువుల వాడకంపై అవగాహన కలిగి ఉండాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 4 (విజయక్రాంతి) : రైతులు నేల ఆరోగ్యంపై, సమతుల ఎరువుల వాడకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. సోమవారం వనపర్తి మండల పరిధిలోని చిమనగుంటపల్లి క్లస్టర్ అంకురు గ్రామం పరిధిలోని రైతు వేదికలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నేల సంరక్షణ, ఎరువుల వాడకం తదితరాంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని రైతులకు చదివి వినిపించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రైతులు నేల ఆరోగ్యంపై, సమతుల ఎరువుల వాడకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తరచుగా మట్టి పరీక్షలు చేయించుకుని నేల ఆరోగ్యాన్ని ఆధారంగా ఎరువుల వాడకం కొనసాగించడం ఎంతో కీలకమని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో ఐదు మంది రైతులకు మట్టి నమూనాల పరీక్షల అనంతరం భూమి ఆరోగ్య కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని, మిగతా రైతులు కూడా త్వరలోనే భూమి ఆరోగ్య కార్డులను పొందాలని తెలియజేశారు. కె వి కె మదనాపురం సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు నేల సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని, ఎరువులను తగినంత మోతాదులోనే వాడాలని సూచించారు.
రెండు నెలలకోసారి నేల యొక్క మట్టి నమూనాలను పరీక్షించుకొని భూమి ఆరోగ్య కార్డులను పొంది దానికి తగిన విధంగా పంటల కోసం ఎరువుల వాడకండి కొనసాగించాలన్నారు. అదేవిధంగా సమతుల్య ఎరువుల వినియోగం పైన రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. నేలను, మట్టిని, సంరక్షించుకొని భావితరాలకు మంచి వాతావరణాన్ని అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు రైతులకు భూమి ఆరోగ్య కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మార్కెటింగ్ శాఖ డిడి ప్రసాదరావు, మార్కెటింగ్ డిఎం స్వరణ్ సింగ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, సర్పంచులు, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.






