16 August, 2026 | 4:02 PM

Districts - Wanaparthy

article_31850165.webp
వనపర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

వనపర్తి, ( విజయక్రాంతి ) : పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డా. పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వనపర్తి ఐడీఓసీలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలు, 5 మున్సిపాలిటీల పరిధిలో 1,83,013 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 26,465 కొత్త రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా శక్తి తదితర పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా రేషన్ షాపు, రేషన్ వివరాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

15-08-2026

article_25896516.webp
ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం

వనపర్తి, (విజయక్రాంతి) : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వనపర్తి ఐడీఓసీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ డా. పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమంలో భాగంగా వనపర్తి జిల్లాలో 60,545 మంది రైతులకు రూ.480.91 కోట్ల పంట రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. రైతు భరోసా కింద 1,82,768 మంది రైతులకు రూ.212.32 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుములు, జొన్న, ఆముదం, కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.

15-08-2026

article_67819100.webp
రాజపేటలో బీఆర్ఎస్‌కు షాక్..

వనపర్తి మండలం : వనపర్తి మండలం రాజపేట గ్రామంలో బీఆర్ఎస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ గొడుగు ఎల్లన్నతో పాటు పలువురు బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సర్పంచ్‌తో పాటు బాలయ్య, విష్ణు, చంద్రయ్య, తిరుపతయ్య తదితరులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, బాలరాజ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. గత పాలనకు భిన్నంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని, కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాములు, సహదేవుడు, దత్తయ్యపల్లి సర్పంచ్ వెంకటయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్యతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

14-08-2026

article_90146147.webp
నిరంజన్‌రెడ్డిని అడ్డుకున్న ఏపీ పోలీసులు

వనపర్తి, ఆగస్టు 13 ( విజయక్రాంతి ) : శ్రీశైలం ప్రాజెక్టులోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించేందుకు గురువారం వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు జూపాడు బంగ్లా వద్ద జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వినియోగంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే పోతిరెడ్డిపాడును పరిశీలించేందుకు వచ్చామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఏపీకి నీటిని తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం రెండు రాష్ట్రాలపై ఒకే విధంగా ఉంటుందని, ఆ కారణాన్ని చూపుతూ తెలంగాణ రైతులకు నీటి విడుదలలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రాంతానికి నీటిని అందిస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో పెద్ద మొత్తంలో నీటిని తరలించే అవకాశం ఉందని, తెలంగాణలో మాత్రం కృష్ణా నీటిని ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేఎల్‌ఐ పంపులు సక్రమంగా పనిచేయడం లేదని, రైతుల ఒత్తిడి వచ్చిన తర్వాతే నీటి విడుదలకు చర్యలు చేపట్టారని ఆయన విమర్శించారు. 162 కిలోమీటర్ల పొడవైన కాలువలో 102 కిలోమీటర్ల వరకు నీరు చేరని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

14-08-2026

article_45330795.webp
కుటుంబ కలహాలతో కోర్టు అటెండర్ ఆత్మహత్య

అలంపూర్: కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన అలంపూర్‌కు చెందిన కోర్టు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చాకలి శాలన్న (30) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాలన్న కోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు.పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో భార్యతో కుటుంబ విషయమై గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన శాలన్న ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.మృతుడి తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, శాలన్న భార్యకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే ఆరోపణలపై అశోక్, అతని భార్యపై సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

14-08-2026