6 July, 2026 | 2:53 AM

కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు

06-07-2026 01:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 5: తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరింది.పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్లను పక్కనపెట్టి కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదివారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏకపక్షంగా,రాత్రికి రాత్రే,పార్టీ పెద్దలకు,సీనియర్లకు,ముఖ్యలను సంప్రదించకుండా,ఏఐసీసీ ఆదేశాలకు వ్యతిరేకంగా మండల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి ప్రకటించారని మండిపడ్డారు.పార్టీలో కొత్తగా చేరిన వారికి పదవులు ఇచ్చారని,ఇట్టి ఎంపికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట - జనగాం 365(బీ)జాతీయ రహదారిపైకి యోగానంద చార్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకొని ఎమ్మెల్యే సామేలు కబంధ హస్తాల నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని నిరసన తెలుపుతూ,భారీ ధర్నా నిర్వహించారు.

ఎమ్మెల్యే సామేలు ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా త్వరలో గాంధీభవన్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.ఈ కార్యక్రమంలో జిల్లా,నియోజకవర్గ,మండల కాంగ్రెస్ పార్టీ నేతలు,నాయకులు,సీనియర్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.