గ్రే షేడ్ పాత్రల్లో నటించాలని ఉంది
మిరాయ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ బ్యూటీ రితికా నాయక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లండించింది. ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తనను తాను నిరూపించుకునేలా గ్రే షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని చెప్పింది.
అలాగే మహిళా ప్రాధాన్యత కలిగిన కథల్లో ప్రధాన పాత్రలు పోషించడమే తన లక్ష్యమని వెల్లడించింది. ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి రావడం నిరాశ కలిగించినప్పటికీ, అలాంటి సంఘటనలను కెరీర్లో భాగంగానే భావిస్తున్నానని రితికా తెలిపింది. కొన్ని విషయాలు మనం అనుకున్నట్లు జరగవని, అందుకే గతాన్ని తలచుకుంటూ బాధపడకుండా ముందుకు సాగడంపైనే దృష్టి పెట్టానని పేర్కొంది.
‘మిరాయ్’ సినిమా తనలోని నటిగా కొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చిందని రితికా చెప్పింది. ఆ సినిమా తర్వాత విభిన్నమైన పాత్రలు చేయాలనే ఆసక్తి మరింత పెరిగిందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథలు, బలమైన పాత్రలను ఎంచుకోవాలనుకుంటున్నానని తెలిపింది. కథలో తన పాత్రకు ప్రాధాన్యం ఉండటమే తనకు ముఖ్యమని, భవిష్యత్తులో నటిగా వైవిధ్యాన్ని చూపించే పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని రితికా నాయక్ స్పష్టం చేసింది.






