2 March, 2026 | 6:17 AM

పేలిన డిటోనేటర్లు

02-03-2026 02:14 AM
  1.   17 మంది కార్మికులు దుర్మరణం, 18 మందికి గాయాలు
  2. నాగ్‌పూర్ సమీపంలో ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో ప్రమాదం
  3. దురదృష్టకరం: సీఎం ఫడ్నవిస్
  4. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా : పీఎంవో

ముంబై/నాగ్‌పూర్, మార్చి 1: కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో పటాకుల పేలుడు సంఘటన మరువకముందే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మరో బారీపేలుడు సంభవించింది. నాగ్‌పూర్ సమీపంలోని పేలుడు పదార్థాల తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ పేలుడులో 17 మంది కార్మికులు మృతి చెందారు.

మరో 18 మంది గాయపడ్డారు. ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీలో డిటోనేటర్ తయారీ ప్రక్రియలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. కటోల్‌లోని రౌల్‌గావ్‌లో ఉన్న మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ అయిన ఎస్బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో డిటోనేటర్లు పేలాయాని, విధ్వంసకర ఘటనలో 17 మంది కార్మికులు మరణించారని, మరో 18 మంది కార్మికులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు నాగ్‌పూర్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పోద్దార్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాల్‌గావ్‌లోని ఎస్బీఎల్ కంపెనీ డిటోనేటర్లను, మైనింగ్‌లో ఉపయోగించే ఇతర పేలుడు పదార్థాలను తయారు చేస్తుంది. కార్మికులు రోజూమాదిరిగానే ఆదివారం ఉదయం విధులకు హాజరయ్యారు. డిటోనేటర్ తయారీ ప్రక్రియలో అకస్మాత్తుగా శక్తివంతమైన పేలుడు సంభవించింది.

పేలుడు శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో సంబంధిత యూనిట్‌లోని ఒక భాగం కూలిపోయింది. సంఘటన తర్వాత దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. పేలుడు జరిగిన సమయంలో, ప్రభావిత విభాగంలో దాదాపు 25 నుంచి 30 మంది కార్మికులు ఉన్నారు. పేలుడు, మంటల తీవ్రతకు నిర్మాణం కూలిపోయింది.

దీంతో కొంతమంది కార్మికులు ఇప్పటికీ లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేయడానికి, చిక్కుకున్న కార్మికుల కోసం వెతకడానికి సహాయక చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సంఘటనను ‘చాలా దురదృష్టకరం, విషాదకరమైనది’ అని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై స్థానిక యంత్రాంగంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని, తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పీఈఎస్‌ఓ డీఐఎస్‌హెచ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని చెప్పారు. మృతిచెందిన 17 మందికి హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని, వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాని, వారి కుటుంబాల దుఃఖంలో మేము కూడా పాలుపంచుకుంటున్నాం అని సీఎం ఫడ్నవీస్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. 

రూ. 2 లక్షలు, క్షతగాత్రలకు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా : పీఎంఓ

నాగ్‌పూర్ పేలుడు విషాదం పట్ల ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) విచారం వ్యక్తం చేసింది. బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ‘నాగ్‌పూర్‌లోని ఓ కర్మాగారంలో జరిగిన పేలుడు తీవ్ర బాధను కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. స్థానిక ప్రభుత్వం బాధితులకు సహాయం చేస్తోంది. మరణించిన ప్రతి ఒక్కరికీ పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వారి కుటుంబీలకులకు ఇస్తాం. గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తాం’ అని పీఎంఓ పేర్కొంది.