2 March, 2026 | 4:16 AM

ఖమేనీ హతం

02-03-2026 02:35 AM

ఇరాన్ సుప్రీం లీడర్ అధికార నివాసంపై క్షిపణుల దాడి

  1. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు
  2. దాడుల్లో ఖమేనీతోపాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మృతి
  3. అధికారికంగా ప్రకటించిన ఇరాన్ ‘ఐఆర్‌ఐబీ’, అగ్రరాజ్యాధినేత ట్రంప్
  4. తర్వాతి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకూ ముగ్గురు సభ్యుల కౌన్సిల్ పాలన
  5. సుప్రీం లీడర్ రేసులో మోజ్తబా ఖమేనీ, అయతొల్లా అలీరెజా అరాఫీ
  6. ఇరాన్‌లో శాంతిస్థాపనే ధ్యేయం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 
  7. ప్రపంచానికే చారిత్రక విజయం: ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు

అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుపెడతామని చెప్పి ఆ పని పూర్తి చేసింది. ఇరాన్ అణు పరీక్షలు చేస్తే ఎంతటి యుద్ధానికైనా సిద్ధమని ప్రకటించి ఇజ్రాయెల్‌తో జతకట్టింది. రెండు దేశాలు కలిసి ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశపు సుప్రీం లీడర్ సయ్యద్ హుస్సేనీ అలీ అయతొల్లా ఖమేనీ అధికారిక నివాసంపై క్షిపణుల వర్షం కురిపించాయి. దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో మరణించారు.

ఇదే దాడిలో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు సైతం మృతిచెందారు. ఖమేనీ తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నట్లు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు నిర్ధారించిన 15 నిమిషాల్లోనే దాడులు ప్రారంభమయ్యాయి. ఖమేనీ మృతదేహాన్ని భవన శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు ధ్రువీకరించారు. కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు పాలన బాధ్య తలను ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చూసుకోనుంది.

ఖమేనీ మృతితో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. తాము ప్రతిదాడులకు పాల్పడి ట్రంప్‌ను హత్య చేసేదాకా నిద్రపోమని ఇరాన్ ప్రక టించింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధ జ్వాలలు చివరకు మూడో ప్రపంచ యుద్ధం జరిగి ఆర్థిక వినాశనానికి దారి తీయవచ్చని చెబుతున్నారు.

సుప్రీం లీడర్ రేసులో మోజ్తబా

ఖమేనీ రెండో కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన తన తండ్రి కార్యాలయం (బైత్- ఎ- రహబారి) వ్యవహారాలు మొత్తం ఈయనే పర్యవేక్షించేవారు. ఈయనకు ఆ దేశపు సైనిక విభాగమైన ఐఆర్జీసీపై బలమైన పట్టు ఉంది. అలాగే బసీజ్ మిలీషియాతోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి. 2009 నిరసనల అణచివేతలో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే నేతకు ‘అయతుల్లా’ అనే హోదా ఉండాలి. మోజ్తబా ఇటీవలే ఉన్నత స్థాయి మతపరమైన కోర్సుల బోధన ప్రారంభించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే రేసులో అయతొల్లా అలీరెజా అరాఫీ పేరూ వినిపిస్తున్నది. ఈయన ప్రస్తుతం పాలన బాధ్యతలు చేపడుతున్న కౌన్సిల్ ముగ్గురు సభ్యుల్లో ఒకరు. మత విద్యావ్యవస్థకు అధిపతి.

టెహ్రాన్/వాషింగ్టన్, మార్చి ౧: అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (౮౬) హతమయ్యారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఆయన మృతిచెందినట్లు ఇరాన్ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ తన ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులతో దాడి చేయగా, అమెరికా తన తొమహాక్ క్షిపణులతో దాడి చేసింది.

ఖమేనీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, మృతదేహం ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రధాని నెతన్యాహుకు చూపించింది. దీంతో నెతన్యాహు తన సైన్యానికి అభినందనలు తెలిపారు. శనివారం ఇరాన్ రక్షణశాఖ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గారడ్స్ కమాండర్ మహమ్మద్ పక్పూర్, సుప్రీం లీడర్ సలహాదారు అలీ షంఖానీ సహా మరో ఐదుగురు సీనియర్ సైనిక కమాండర్లు మృతిచెందారు. వీరి మృతి నుంచి తేరుకోక ముందే తాజాగా ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ, కుటుంబ సభ్యులు మృతిచెందడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సుప్రీం లీడర్ మృతితో ఇరాన్ ప్రభుత్వపెద్దలు 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.

ఖమేనీ చివరి సందేశం?

ఖమేనీ మరణ వార్త వెలువడిన కొద్ది నిమిషాల్లోనే ఆయన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక ఖురాన్ వాక్యం పోస్ట్ ప్రత్యక్షమైంది. ‘అల్లాకు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న వారే నిజమైన విశ్వాసులు. వారిలో కొందరు తమ ప్రమాణాన్ని నెరవేర్చగా, మరికొందరు ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు’ అని పోస్ట్‌లో రాసింది. ఇది ముందే షెడ్యూల్ చేసిన సందేశమా లేక వ్యూహాత్మకంగా పోస్ట్ చేసిన చివరి వీడ్కోలా అన్నది అస్పష్టంగా ఉంది.

బాగ్దాద్‌లో ఆందోళనలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్త దావానలంలా ప్రపంచ దేశాలకు చేరింది. అనేక దేశాల పౌరులు ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులపై స్పందించారు. రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇరాక్‌లోని బాగ్దాద్ అమెరికా రాయబార కార్యాలయ సమీపంలో ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకారులు అక్కడి గ్రీన్ జోన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించగా, భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. మరోవైపు, లిబనాన్‌కు చెందిన హిజ్‌బుల్లా నేత నైమ్ ఖాసిమ్ ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాగతాలను అడ్డుకునేందకు తమ సంస్థ సిద్ధమైందని ప్రకటించారు. ఆ రెండు దేవాలపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

ఇరాన్ ప్రతీకార దాడులు

అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణి దాడులను ఉధృతం చేసింది. అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌక యుఎస్‌ఎస్ అబ్రహం లింకన్’ను లక్ష్యంగా చేసుకుంది. అయితే.. ఆ క్షిపణులను అమెరికా రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. అలాగే ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, జెరూసలేం నగరాలపై ప్రయోగిస్తోంది. తన ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ నెట్‌వర్క్ ద్వారా హిజ్‌బుల్లాతోపాటు ఇతర మిత్ర దళాలను సైతం యుద్ధంలోకి దించింది.

రెబల్ లీడర్ నుంచి దేశాధినేతగా ఖమేనీ

అయతొల్లా అలీ ఖమేనీ 1939లో ఇరాన్‌లోని మషద్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక మత బోధకుడు. ఆయన నజాఫ్, కోం నగరాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. విద్యార్థి ఉద్యమాల్లో ముఖ్యనేతగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయనకు ఇస్లామిక్ విప్లవ వీరుడు అయతొల్లా రుహోల్లా ఖొమేనీతో పరిచయం ఏర్పడింది. ఖమేనీ ఆయన్ను తన గురువుగా భావించేవారు. రుహోల్లా బోధనలతో ఖమేనీకి నిశ్చితమైన రాజకీయ అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

1960వ దశకంలో ఇరాన్ రాజు (షా) పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఖమేనీ కీలక పాత్ర పోషించారు. అనేకసార్లు అరెస్టయ్యారు. అనేక సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు. అయినప్పటికీ ఆయన తన పోరాటాన్ని ఆపలేదు. 1979 ఇస్లామిక్ విప్లవంలో ఖమేనీ పాత్ర ఎంతో ఉంది. విప్లవం తర్వాత ఇరాన్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో తన గురువు అయతొల్లా రుహోల్లా ఖొమేనీ దేశాధినేత అయ్యారు. ఆ ప్రభుత్వంలో ఖమేనీ కీలక బాధ్యతలు చేపట్టారు.

క్రమంగా రివల్యూషనరీ కౌన్సిల్ సభ్యుడిగా, రక్షణ శాఖ ఉప మంత్రిగా సేవలందించారు. 1989వరకు సుప్రీం లీడర్‌గా ఖొమేనీనే సేవలందించారు. ఖొమేనీ మరణం తర్వాత, ఆయన వారసుడిగా ‘ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఖమేనీని ఎంపిక చేసింది. దీంతో ఖమేనీ ఇరాన్ సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడు దశాబ్దాలకు పైగా ఆయన ఇరాన్ పాలనా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు.

అమెరికా వంటి పాశ్చాత్య దేశాలతో తీవ్రమైన విభేదాలు తలెత్తిన సమయంలోనూ ఆయన పరిణతి నిర్ణయాలు తీసుకునేవారు. అణు పరీక్షలపై చివరి వరకు ఆయన పట్టుదలతో ఉండేవారు. తమ దేశం స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలంటే అణ్వాయుధ సంపత్తి ఉండాలని బలంగా విశ్వసించారు. అందుకే.. ఆయన అమెరికా బెదిరింపులకు సైతం బెదరలేదు. ఏదేమైనా.. ఖమేనీ మరణంతో ఇరాన్ చరిత్ర ఒక కీలక అధ్యాయం ముగిసినట్లయింది. ఖమేనీ మరనం తర్వాత, ఇప్పుడా దేశా భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందనేది ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది.

కరాచీలో ఉద్రిక్తత

12మంది మృతి.. పలువురికి గాయాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో చెలరేగిన ఆగ్రహజ్వాలలు పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు వ్యాపించాయి. వందలాది మంది ఆందోళనకారులు కరాచీలోని యూఎస్ కాన్సులేట్ భవనం బయటి గోడను ధ్వంసం చేసి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. భవనంలోని అద్దాలను పగలగొట్టి, ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఓ గదికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. దీంతో పాకిస్థాన్ పోలీసులు, అమెరికా భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించగా, 30 గాయపడినట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు, పోలీసులు ధ్రువీకరించారు.

ఇరాన్‌లో శాంతిస్థాపనే ధ్యేయం

‘సోషల్ ట్రూత్’లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 

ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఇది గొప్ప అవకాశం. మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం నేతగా వ్యవహరిస్తున్న ఖమేనీని మట్టుపెట్టి ఆ దేశ ప్రజలకు విముక్తి కలిగించాం. నిరంకుశ పాలనకు సరైన ముగింపు పలికాం. అత్యాధునిక నిఘా వ్యవస్థలు, ఆయుధ సంపత్తితో ఖమేనీ కదలికలు పసిగట్టాం. మేం ఇజ్రాయెల్‌తో కలిసి ఈ వైమానిక దాడులు చేయించాం.

ఇది రెండు దేశాల సంయుక్త ఆపరేషన్. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం. నేనొక శాంతి కాముక దేశాధ్యక్షుడిని. అందుకే ఇరాన్ అణ్వాయుధ పరీక్షలు చేయకుండా అడ్డుకున్నాం. తద్వారా మా మిత్ర దేశాలన్నింటికీ ఉగ్రవాద ముప్పును తప్పించాం. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే మా ధ్యేయం. అంతవరకూ మా పోరాటం ఆగదు. అమెరికాతో పాటు మా మిత్రదేశాలకు ఎవరు హాని చేయాలని చూసినా, వారికి ఇలాంటి శిక్షే పడుతుంది.

ప్రపంచానికే చారిత్రక విజయం

ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు

ఖమేనీ హతం యావత్ ప్రపంచానికే చారిత్రక విజయం. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు, ఉగ్రవాదానికి కారణమైన, క్రూరమైన ఖమేనీ శకం ముగిసింది. ఇది ఒక ఇజ్రాయెల్, అమెరికా విజయం మాత్రమే కాదు. స్వేచ్ఛను కోరుకుంటున్న ఇరాన్ ప్రజల విజయం కూడా. అణు పరీక్షలు నిర్వహించి మమ్మల్ని భయపెట్టాలని చూసిన నియంత ఖమేనీకి తగిన శాస్తి జరిగింది. మా దేశ రక్షణ కోసం మేం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఖమేనీని హతమార్చి నిరూపించాం. ఇది మేం అమెరికాతో కలిసి సాధించిన ఈ విజయం.