2 March, 2026 | 9:00 AM

400కు పైగా విమానాలు రద్దు

02-03-2026 02:11 AM

న్యూఢిల్లీ, మార్చి 1 : ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. దాంతో ఆదివారం భారత్ నుంచి వెళ్లాల్సిన దాదాపు 400కు పైగా విదేశీ విమానాలను రద్దుచేశారు.  ఈ విషయాన్ని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొత్తం ఎన్ని విమానాలు రద్దయ్యాయి..? ఇంకా ఎన్ని రద్దు కానున్నాయి..? ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నా యనే విషయంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాల్లోని టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్ అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ తెలిపింది.

ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ’ఏయిర్సేవే’కు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వాటిలో 105 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది.

విమానాల మళ్లింపులు, రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు సూచించినట్లు తెలిపింది. మరో వైపు ఆదివారం సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఏయిరిండియా ప్రకటించింది. వీటిలో లండన్, షికాగో, టొరంటో, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలు ఉన్నట్లు తెలిపింది. దోహా నుంచి వెళ్లాల్సిన అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఖతార్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది.

విదేశీయులకు హోం మంత్రిత్వ శాఖ అడ్వైజరీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని విదేశీయులకు అడ్వైజరీ జారీ చేసింది. భారీగా విమానాలు రద్దవుతున్న నేపథ్యంలో ప్రయాణాలకు అంత రాయం కలిగిన విదేశీయులు సమీపంలోని విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం  నుంచి సహాయం తీసుకోవాలని సూచించింది. భారత్‌లో తమ వీసాలను పొడిగించుకోవడానికి, క్రమబద్ధీకరించుకోవడానికి అవసరమైన సహాయాన్ని అధికారులు అందిస్తారని తెలిపింది.

శంషాబాద్ నుంచి 44 విమానాలు ..

రంగారెడ్డి, మార్చి 1( విజయక్రాంతి) : ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు అప్రమత్తమవ్వడంతో శంషాబాద్  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమానాలు రద్దయ్యాయి.నిలిచిపోయిన సర్వీసులుయుద్ధం కారణంగా గల్ఫ్, అరబ్ దేశాలకు వెళ్లే మార్గాల్లో విమాన ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సిన 23 సర్వీసులు, ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు రావాల్సిన 21 సర్వీసులు మొత్తంగా 44 విమానాలు నిలిచిపోయాయి.