మొక్కుబడి పనులు..?
ఇందిరాపార్కులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసిన కాసేపటికే పగుళ్లు!
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణా లోపానికి ఇందిరా పార్క్ ఓపెన్ జిమ్ ఘటనే నిదర్శనం
ముషీరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ముషీరాబాద్లోని కవాడిగూడ ఇందిరా పార్కులో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఓపెన్ జిమ్.. నాణ్యతా లోపాలతో మొదటి రోజే వివాదంలో చిక్కుకుంది. వ్యాయామనికి వచ్చే వారి ప్రాణాలతో చెలగాటమా?..అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేసి వెళ్లారో లేదో.. అప్పుడే జిమ్ పరికరాలలో తమ అసలు రంగు బయటపెడ్డాయి. వ్యాయామం చేసే ఒక ప్రధాన పరికరం యొక్క ఇనుప పైపు జాయింట్ వద్ద నిలువుగా పెద్ద చీలిక వచ్చింది. కంటితుడుపు వెల్డింగ్ పరికరాల తయారీలో ఎంత నాసిరకం మెటీరియల్ వాడారో ఆ పగులు చూస్తే అర్థమవుతోంది.
పూలదండల వెనుక నాణ్యత లోపం..
ప్రారంభోత్సవం కోసం పూలమాలలతో అలంకరించిన ఆ హడావుడి వెనుక, కనీస బరువును కూడా తట్టుకోలేని నాసిరకం ఇనుప పరికరాలను అమర్చడంపై పలువురు సందర్శకులు మండిపడుతున్నారు.
తప్పిన ప్రమాదం..
ఎవరైనా భారీ కాయం ఉన్నవారు దీనిపై వ్యాయామం చేస్తుండగా ఇది పూర్తిగా విరిగిపోతే పరిస్థితి ఏంటని, ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి పరికరాలకు పర్మిషన్ ఎలా ఇస్తారని జీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి..
ప్రజాధనాన్ని మంచి పనుల కోసం కాకుండా, ఇలాంటి నాసిరకం మెటీరియల్స్ కొనుగోలు చేస్తూ వృథా చేస్తున్నారని మార్నింగ్ వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే సదరు కాంట్రాక్ట్ప చర్యలు తీసుకోవాలని, ఇందిరా పార్కులోని మిగతా జిమ్ పరికరాల నాణ్యతను కూడా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.






