6 July, 2026 | 1:24 AM

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలి

06-07-2026 12:28 AM

వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

వేములవాడ, జూలై 5,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలోని ప్రతి ఓటరికి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు తెలిపారు.ఆదివారం 15వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఎస్‌ఐఆర్కు సంబంధించిన వివరాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సరిగా నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైతే నిర్ణీత గడువులోపు సవరణలు, మార్పులు చేసుకోవాలని కోరారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేదా అనుమానాలు లేకుండా సరైన సమాచారం అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అందుకే వార్డు స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నామని తెలిపారు.ఈ ప్రక్రియలో ఓటర్లకు అవసరమైన సహాయం అందుబాటులో ఉంటుందని, ఏవైనా సందేహాలు ఉంటే బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలను సంప్రదించి వెంటనే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కును పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని పుల్కం రాజు పిలుపునిచ్చారు.ఈ అవగాహన కార్యక్రమంలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.