గంగదేవి గుట్టకు గండం.. 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా? స్థానికుల ఆందోళన
- 36.10 ఎకరాలలో గుట్ట విస్తీర్ణం
- ఇప్పటికే సుమారు 10 ఎకరాల మేర పూర్తయిన స్వాహా కార్యం.
- తుమ్మగూడెం గ్రామపంచాయతీకి కేటాయించిన ఎకరంలో ఏర్పాటు చేసిన బోర్డు మాయం..
- అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు.
- కబ్జాదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు అంటూ ప్రచారాలు.
- గుట్ట భూమిని కాపాడాలంటూ స్థానికుల వేడుకోలు.
మోతె: రోజురోజుకు వ్యవసాయ భూముల విలువ పెరుగుతుండడంతో మనిషిలో ఉన్న స్వార్థ బుద్ధి రాను రాను మరింత పెరుగుతోంది. దీంతో అందిన కాడికి పక్కనున్న వారి భూమిని కలుపుకోవడమో,కాకుండా దౌర్జన్యంగా ఆక్రమించడము చేస్తుండడంతో వివాదాలు సైతం పెరుగుతున్నాయి. ఇక పక్కన ప్రభుత్వ భూమి ఉంటే చాలు అందిన కాడికి ఆక్రమించడమే వారివంతవుతుంది. ఇదే విధానం మండలంలోని ఉర్లుగొండ రెవెన్యూ గ్రామ పరిధిలో గల తుమ్మగూడెం సమీపంలో గల గంగదేవి గుట్ట విషయంలోనూ ఇదే జరుగుతుంది. గుట్ట పక్కన ఉన్న భూములు గల వారు ఆక్రమించడమే కాకుండా భూములు లేని వారు, ఇతర గ్రామాలకు చెందిన వారు అవకాశం ఉన్నకాడికి ఆక్రమిస్తుండడంతో గంగదేవి గుట్టకు గండం వాటిల్లుతుందని స్థానికులు చెబుతున్నారు.
గంగదేవి గుట్ట కబ్జా కేసులో 36.10 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇప్పటికే సుమారు 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ బోర్డు మాయం కావడం, అధికారుల చర్యలు లేకపోవడంతో జిల్లా అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అందినకాడికి ఆక్రమణ : తుమ్మ గూడెం సమీపంలో గల గంగదేవి గుట్ట 36 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ఉన్నట్లు రికార్డులలో నమోదయింది. అయితే దీనిలో చుట్టూ భూములు ఉన్న వారు, ఇతర కబ్జాదారులు ఇప్పటికే సుమారు 10 ఎకరాల మేర ఆక్రమించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే మిగిలిన భూమిలో కూడా ఇప్పటికీ కొందరు స్వార్ధపరులు దాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.
గ్రామపంచాయతీ బోర్డు మాయం.. అధికారులపై అనుమానాలు
తుమ్మగూడెం గ్రామపంచాయతీకి ఎకరం భూమి కేటాయింపు : సుమారు 10 ఎకరాల మేర ఆక్రమణకు గురికాగా మిగిలినటువంటి భూమిలో ఎకరం భూమిని వివోఏ బిల్డింగ్, ఫుడ్ గ్రీన్ గోడౌన్ నిర్మించేందుకు గాను తుమ్మ గూడెం గ్రామపంచాయతీకి అధికారులు కేటాయించారు. అయితే దీనికి కొంతకాలం హద్దులు పెట్టకపోవడంతో కొంతమంది కబ్జాదారులు ఆక్రమిస్తున్నారనే విషయం బయటకు రావడంతో అధికారులు వెంటనే వెళ్లి హద్దులు నిర్ణయించి అక్కడ గ్రామపంచాయతీకి కేటాయించబడిన భూమి అని బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.
మాయమైన బోర్డు : తుమ్మ గూడెం గ్రామపంచాయతీకి రెవెన్యూ అధికారులు ఎకర భూమిని కేటాయించగా గత శుక్రవారం రోజున అధికారులు హద్దులు నిర్ణయించడంతో ఆ గ్రామపంచాయతీ సర్పంచ్, జిపిఓ, పంచాయతీ కార్యదర్శులు రెవిన్యూ అధికారుల సమక్షంలో బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఆరోజు రాత్రి కొందరు స్వార్ధపరులు తాము కబ్జా చేస్తున్న భూమిపై ఇలా ఏర్పాటు చేస్తున్నారన్న అక్కసుతో రాత్రికి రాత్రి బోర్డును మాయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అధికారులు తీరుపై అనుమానాలు : గుట్ట మొత్తం విస్తీర్ణం 36 ఎకరాల 10 గుంటలు అయినప్పటికీ గతంలోనే సుమారు 10 ఎకరాల మేర కబ్జాకు గురైనప్పటికీ అధికారులు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో గతంలోనే వారిపై పలు విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు కబ్జాదారులు గంగదేవి గుట్ట భూమిని పట్టపగలే బ్లాస్టింగ్ లు చేయడంతో పాటు బుల్డోజర్లు పెట్టి చదును చేయించిన వారిని గుర్తించి వారిపై కనీసం పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయలేదని స్థానికులు పలు ఆరోపణలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు, పంచాయతీ అధికారులకు కబ్జాదారులు ముట్ట చెబుతున్న ముడుపుల తోనే ఏమి తెలియనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికంగా వార్తలు వెలువడుతున్నాయి. పలువురు అధికారులు కబ్జాకోరులతో చేతులు కలపడం ఫలితంగానే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అనుమానాలు స్థానికంగా బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్న జిల్లా అధికారుల సైతం స్పందించకపోవడంతో వారి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
కబ్జాదారులకు రాజకీయ అండ ఉందా? స్థానికుల ఆరోపణలు
కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండదండలు: గంగదేవి గుట్ట భూమిని ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం హైదర్ సాయిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తుమ్మ గూడెం గ్రామానికి వలస వచ్చి అక్కడే ఉంటూ గుట్టలోని సుమారు రెండు ఎకరాల భూమిని ఆక్రమించి చదును చేసి దానిలో పేసర్లు చల్లగా అవి ఇప్పటికే మొలకెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్న మండల అధికారులు మాత్రం దాని గురించి ఏమీ తెలియనట్టుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే కబ్జాదారుకు మండలంలోని కొందరు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని వార్తలు స్థానికంగా గుప్పుమంటున్నాయి. అధికారులతో నేను మాట్లాడతాను నీ పని నీవు కానివ్వు అనే అభయం ఇవ్వడంతోనే కబ్జాదారు నిర్భయంగా గుట్టను చదును చేసి సాగు చేసినట్లు స్థానికులు బాహటంగా చెబుతున్నారు.
అయితే అదే అధికార పార్టీ నాయకుల్లో కొందరు గుట్ట భూమి ఆక్రమిస్తున్న కబ్జాకోర్లకు కొందరు నాయకులు అండగా నిలవడంతోని పార్టీకి ఇబ్బంది కలగడంతో పాటుగా, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినప్పటికీ వారు వెనుకకి తగ్గడం లేదని పలువురు అధికార పార్టీ నాయకులే చెబుతుండడం స్థానికంగా చర్చకు దారి తీస్తుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గుట్ట భూమి స్వాహా చేస్తున్న కబ్జా కోర్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అన్యాక్రాంతమవుతున్న గంగాదేవి గుట్టను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
సమాచారం నాకు అందలేదు: వెంకన్న, తాసిల్దార్, మోతె.
తుమ్మ గూడెం గ్రామపంచాయతీకి ఎకరం భూమి కేటాయించిన మాట వాస్తవమే. అయితే ఆ భూమిలో బోర్డు ఏర్పాటు చేసిన విషయం నాకు తెలియదు. అలాగే దానిని తొలగించిన విషయము నాకు తెలియదు. అది ఒకవేళ పంచాయతీ కార్యదర్శి ఏర్పాటు చేస్తే దానిని తొలగిస్తే వారే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ సమాచారం నాకైతే ఇప్పటివరకు అందలేదు.
ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారా?
మోతె మండలంలోని గంగదేవి గుట్టలో ఇప్పటికే 10 ఎకరాలకుపైగా భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ బోర్డు మాయం కావడం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
FAQ's
గంగదేవి గుట్ట ఎంత విస్తీర్ణంలో ఉంది?
రికార్డుల ప్రకారం గంగదేవి గుట్ట 36 ఎకరాల 10 గుంటల విస్తీర్ణంలో ఉంది.
స్థానికులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు?
ప్రభుత్వ భూమి ఆక్రమణ, బోర్డు తొలగింపు, అధికారుల నిర్లక్ష్యం వల్ల స్థానికులు జిల్లా అధికారుల జోక్యాన్ని కోరుతున్నారు.
అధికారులు ఏమన్నారు?
తహసీల్దార్ వెంకన్న మాట్లాడుతూ బోర్డు ఏర్పాటు, తొలగింపు విషయంపై తనకు సమాచారం అందలేదని తెలిపారు.
గంగదేవి గుట్టలో ఏమి జరిగింది?
36.10 ఎకరాల ప్రభుత్వ గుట్టలో ఇప్పటికే దాదాపు 10 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ బోర్డు తొలగింపు, బ్లాస్టింగ్, భూమి చదును చేయడంపై కూడా ఆరోపణలు ఉన్నాయి.
గంగదేవి గుట్ట ఎక్కడ ఉంది?
గంగదేవి గుట్ట సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ రెవెన్యూ గ్రామ పరిధిలోని తుమ్మగూడెం సమీపంలో ఉంది.
RELATED ARTICLES....






