21 July, 2026 | 11:51 AM

క్యూర్‌లో ఇందిరమ్మ షురూ

21-07-2026 01:25 AM
  1. ఇళ్లకు నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు
  2. తొలివిడతలో 16 నియోజకవర్గాల్లో 8వేల ఇళ్లు
  3. త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు
  4. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇళ్ల మంజూరులో రిజర్వేషన్
  5. ఒక్కో ఇంటికి మొత్తం రూ.11 లక్షలు
  6. రూ.5లక్షలు ప్రభుత్వ సబ్సిడీ.. లబ్ధిదారు వాటా రూ.6 లక్షలు
  7. పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం ఉండదు 
  8. రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో తొలి విడతగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిం చింది. 16 అసెంబ్లీ నియోజ వర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మరో 8 నియోజకవర్గాలలో కూడా ఈ పథకం అమలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

ఇందిరమ్మ ఇంటి కోసం ఈనెల 21 (మంగళవారం) నుంచి మీసేవ, వాట్సాప్ (నెంబర్ 809695 8096), వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకో వాలని మంత్రి తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో కలిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్, మీసేవ, వాట్సాప్ దరఖాస్తులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదల నివాస ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల వైశాల్యం తో సుమారు రూ.40 నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన స్థలాలను ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని తెలిపారు. ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉంటాయన్నారు. దీనిని పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం ఉండదని, అయి తే బ్యాంకులో రుణం కోసం తనఖా పెట్టుకోవచ్చు నని తెలిపారు. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుందని మంత్రి వెల్లడించారు.

ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు రూ.10 వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంద ని, ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే రూ.10 వేల తిరిగి చెల్లిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలను ఉచితంగా ఇస్తుందని, మిగిలిన రూ.6 లక్షలు నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామని, ఆ మొత్తంలో ముందుగా చెల్లించిన రూ.10 వేలు మినహా యిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

లబ్ధిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల వరకు ఉండాలని, దరఖాస్తు దారుని పేరిట క్యూర్ పరిధిలో స్థలం గానీ, సొంత ఇల్లు కానీ ఉండకూడదన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారని, అర్హతను బట్టి కేటాయింపు జరుగుతుందన్నారు.

360 డిగ్రీల పరిధిలో ఇందిర మ్మ ఇళ్ల లబ్ధిదారుల వడపోత జరుగుతుందని, అప్పటికీ ఎక్కువ దరఖాస్తులు వస్తే అందరి ముందూ బహిరంగంగా లాటరీ తీసి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవర్గంలోనే దరఖా స్తు చేసుకోవా లన్నారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి స్థలాలను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. 

గుడెసెలు లేని రాష్ట్రమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు 

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మక కార్యక్రమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. క్యూర్ రీజియన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల(ఎల్‌ఐజీ హౌసింగ్ టవర్ల)కు శ్రీకారం చుట్టామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్ -2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ వరకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామ ని చెప్పారు. ఆ లక్ష్య సాధనకు తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. క్యూర్ విజన్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువని, గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే క్యూర్ విజయమన్నారు.

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాల కొరత ఉందని, ఆ కొరతను అధిగమించి.. పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు రూ.వందల కోట్ల విలువైన స్థలాల్లో ఈ ఎల్‌ఐజీ హౌసింగ్ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికుల్లో అర్హులైన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తా మని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుంటు న్నామన్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్  అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్, ప్రకాష్‌గౌడ్, శ్రీగణేష్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్ ,జుల్ఫీకర్ అలీ, జాఫర్ హుస్సేన్, ముబీన్, హౌసింగ్ శాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల, కమీషనర్లు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ

పేదవాడి సొంతింటి కల నెరవేరేవరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం కొనసా గుతుందని, చివరి లబ్ధిదారునికి ఇల్లు అందేవరకు నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండవ విడతలో 2.50 లక్షల ఇళ్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నా మని తెలిపారు. గత పాలకులు హైదరాబాద్‌కు 30- నుంచి 35 కిలోమీటర్ల దూరంగా ఇళ్లను నిర్మించడం వల్ల కేవలం 8-9 వేల మంది మాత్రమే నివాసాల్లో దిగారని పేర్కొన్నారు.

మిగిలిన వారు మంజూరు పత్రాలు తీసుకున్నారే తప్ప దిగలేదన్న విషయం తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. ఈ పరిస్థితుల్లో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. తొలివిడతలో 16 నియోజకవర్గాల్లో 8వేల ఇళ్లు, త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తిస్తామన్నారు. 

వచ్చే బోనాల పండుగా ఇందిరమ్మ ఇళ్లలోనే..

హైదరాబాద్ లోప్రస్తుతం జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్బంలో క్యూర్ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వచ్చే ఏడాది క్యూర్ పరిధిలో కొత్త  ఇందిరమ్మ ఇళ్ల నుంచే వచ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శరవేగంగగా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాని సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని బట్టి ప్రతిసోమవారం చెల్లింపులు జరుపుతున్నామన్నారు. ఇళ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజానీకానికి కూడా శుభావార్త అందిస్తామన్నారు.