21 July, 2026 | 12:34 PM

కోల్డ్‌స్టోరేజీలో ప్రభుత్వం

21-07-2026 02:02 AM
  1. డెడ్ స్టోరేజ్‌లో రిజర్వాయర్లు 
  2. కాళేశ్వరం బటన్ నొక్కడానికి బాధేంటి? 
  3. అన్నివర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ 
  4.   70 వేల ఉద్యోగాలపై సవాల్‌ను స్వీకరించు రేవంత్? 
  5. గాచారం బాగాలేకనే మునిగే పడవ కాంగ్రెస్‌లోకి పోచారం 
  6. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  7. బీఆర్‌ఎస్‌లో చేరిన బాన్సువాడ ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ‘రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీల్లో ఉంటే ప్రభుత్వం కోల్ స్టోరేజ్‌లో పడుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్‌నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏమిటి? రైతులు ఇప్పటికే నష్టపోయారు’ అని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి ప్రణాళిక లేదని, దిశ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని ఆరోపించారు. ‘రెండేళ్లు దాటినా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని అన్నారు. 70 వేల ఉద్యోగాల నియామకంపై తన సవాల్‌కు ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పలేదన్నారు.

‘నువ్వే 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ ఆ సవాల్‌ను స్వీకరించే దమ్ము సీఎంకి లేదు‘ అని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై, సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై, పార్టీ మారిన పోచారంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్ హనుమంత్ షిండే, జీవన్‌రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గాచారం బాగాలేకనే కాంగ్రెస్‌లోకి పోచారం..

బాన్సువాడ ప్రజలు ఒకప్పుడు గులాబీ జెండాను ఎగరేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని విశ్వసించి గెలిపించారని, అయితే ఆయన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని కేటీఆర్ అన్నారు. ‘సింపుల్‌గా చెప్పాలంటే గాచారం బాగాలేకనే పోచారం వేరే దానికి పోయిండు. అంతే తప్ప ఇంకేం లేదు. ఎవడైనా తెలిసి తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? కాంగ్రెస్ అనేది అసలు ఉండే పార్టీయా? భవిష్యత్తు ఉన్న పార్టీయా? నాది కాంగ్రెస్‌లోనే పుట్టుక అని పెద్దపెద్ద డైలాగులు కొట్టి అందులో చేరాడు.

ఇప్పుడు మింగలేక కక్కలేక, కుడితిలో పడ్డ ఎలుక లాగా గిలగిల కొట్టుకునే పరిస్థితికి చేరుకున్నాడు. ఈ వయసులో ఆ పెద్ద మనిషికి ఇంతకంటే అవస్థ అవసరమా?’ అని ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇవాళ తాను ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఓడించడమే బీఆర్‌ఎస్ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన బాన్సువాడ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి కోట్లాది నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా దేవుడి మీద ఒట్టేసి ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీతోనే ఉంటా’ అని చెప్పిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. ‘దేవుడి మీద రేవంత్‌రెడ్డి ఒక్కడే ఒట్లు పెట్టి మోసం చేస్తాడనుకున్నాం.

కానీ పోచారం కూడా మోసం చేశారు. ఆయనను ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల వెంకన్న స్వామి శాపం ఆయనకు తప్పకుండా తగులుతుంది. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేము మీతోనే ఉంటాం’ అని స్పష్టం చేశారు. 

బాన్సువాడలో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయం

బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా రైతులకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతోందని కేటీఆర్ ఆరోపించారు. ‘ఇక్కడ నీళ్లు లేవంటారు. కానీ అదే నీళ్లు కిందకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో మోటార్లు నడుస్తున్నాయి. వరంగల్‌లో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అక్కడ నీళ్లు ఉంటే ఇక్కడ ఎందుకు లేవు?’ అని ప్రశ్నించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద జరిగిన నిరసనను గుర్తు చేస్తూ కేటీఆర్ మాట్లాడారు.

రైతులకు నీళ్లు విడుదల చేయాలని కోరితే రక్తం గురించి వ్యాఖ్యలు చేశారని, అందుకు నిరసనగా మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి రక్తదానం చేసి ఎస్‌ఆర్‌ఎస్పీకి నీళ్లు విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ‘తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తాం. రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధం. కానీ రైతులను ఎండబెట్టే ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని అన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులకు రూ.4వేల పెన్షన్, యువతకు ఉద్యోగాలు వంటి హామీలు అమలుకాలేదని విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

మోరిల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు బీఆర్‌ఎస్‌లో చేరడం బాన్సువాడలో పార్టీ మరింత బలోపేతం అవుతోందనడానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బాన్సువాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ విజయఢంకా మోగిస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి ఒక చిచోరా

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రేవంత్‌రెడ్డి ఒక చిచోరా. ఏం మాట్లాడుతాడో, ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి. మన కర్మ బాగాలేక ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ డబ్బులు దోసుకోవడం, మూటలు కట్టడం, నెలకొకసారి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి అప్పగించడం, రెన్యూవల్ వేయించుకుని రావడం తప్ప ఆయనకు ఇంకేమీ తెలియదు’ అని అన్నారు.

రెండేళ్లకు పైగా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆరోపించారు. ‘తెల్లారితే కేసీఆర్‌ను తిట్టడం, దేవుళ్ల మీద ఒట్లు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో పనిలేదు. రెండున్నర ఏండ్లలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది’ అని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

యూరియా కొరత, విద్యుత్ సమస్యలు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, సాగునీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు సకాలంలో అందేదని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

‘నిజాంసాగర్ సామర్థ్యం 17 టీఎంసీలు. కేవలం రెండు రోజులు మోటార్లు నడిపితే ప్రాజెక్టు నిండిపోతుంది. కానీ ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు’ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని, కానీ మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. ‘31 నెలలు గడిచినా రెండు పిల్లర్లను బాగు చేయలేరా? మేస్త్రీలు దొరకలేదా? సిమెంట్ దొరకలేదా? ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం పేరుతో అబద్ధాలు చెబుతోంది’ అని మండిపడ్డారు.