బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
- తెలంగాణలో కొత్త ఎత్తుగడ
- కాంగ్రెస్-, బీఆర్‌ఎస్ నేతలకు గాలం-
- జిల్లాల్లోని ఇతర పార్టీ నేతలను బీజేపీలోకి చేర్చుకునేలా స్కెచ్
- నెల రోజుల టార్గెట్ ఫిక్స్ చేసిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్
* బీజేపీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో కమలం గేర్ మార్చింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించినమేర సీట్లను గెలుచుకున్న కమలం పార్టీ... అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ఎన్నికల్లో అధికారం దిశగా బలపడాలని భావిస్తోంది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో రాజకీయ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది.
దీనికి టార్గెట్‌గా 30 డేస్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముప్పు రోజుల్లో రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ఇతర పార్టీల నేతలపై సంధించాలని స్కెచ్ వేసింది. దీనిని డెడ్‌లైన్‌గా పెట్టుకుని రాష్ట్రంలో పార్టీ పునాదులను బలోపేతం చేసే పని జాతీయ నాయకత్వం చేపట్టింది.
హైదరాబాద్ జూలై 20 (విజయక్రాంతి): ఇతర పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలంటే ముందు తమ పార్టీలోని నేతల మధ్య అంతర్గత విభేదాలను చక్కదిద్దాల్సి ఉందని భావించిన కమలం అధిష్ఠానం ఆ బాధ్యతను పార్టీ ముఖ్యనేత, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్‌కు అప్పగించారు. ఈక్రమంలోనే ఆయన రంగంలోకి దిగి ఇటీవల ఈటల రాజేందర్, బండి సంజయ్‌తో సమావేశమై ఆపరేషన్ సయోధ్యను పూర్తి చేశారు.
ఈ భేటీ అనంతరం బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తోనూ ఆయన సమావేశమై పార్టీ అంతర్గత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతోపాటు పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇలా పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలున్నా తొలుత వాటిని పరిష్కరించి వారందరినీ యాక్టివ్ మోడ్‌లోకి తీసుకొచ్చేలా రంగంలోకి దిగారు.
ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేసేలా వ్యూహాలను రచిస్తున్నారు. రాబోయే నెల రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్‌ను అమలు చేయాలని భావిస్తున్నారు. పార్టీ నేతలకు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడాల్సిందేనని గట్టిగా చెప్పినట్లుగా తెలుస్తోంది.
జిల్లాలే టార్గెట్..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం ఉందని, దీన్ని క్యాష్ చేసుకుని ఆ దిశగా వ్యూహాలను అమలుచేయాలని రాష్ట్ర నాయకత్వానికి ఆయన అంతర్గత సమావేశాల్లో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలపై ఫోకస్ పెట్టింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను టార్గెట్ చేసుకుంటోంది. బీజేపీ పార్టీ ఏ జిల్లాల్లోనైతే బలహీనంగా ఉందో, ఆ పార్టీకి బలమైన నాయకుల్లేని జిల్లాలపై తొలుత దృష్టి సారించింది.
ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలను పార్టీలో చేర్చుకునేలా ఆకర్ష్ మంత్రాన్ని అమలు చేయబోతోంది. నెల రోజుల్లో ఏం జరగబోతోందో మీరే చూడండంటూ మీడియాకు ఆయన లీకులిచ్చారు. బీజేపీ డోర్లు తెరిచామన్నారు. రానున్న గ్రేటర్ పరిధిలోని ట్రై కార్పొరేషన్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జిల్లాల్లోని మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీలో.. ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లభించని ముఖ్యమైన నాయకులపై ఆపరేష ఆకర్ష్ అస్త్రాన్ని ఎక్కుపెట్టేలా వారికి రాష్ట్ర నాయకులకు స్పష్టమైన లక్ష్యాలను ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పార్టీ నేతలకు టచ్‌లో!..
బీజేపీ ఈ ఎత్తుగడ వేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి సంస్థాగతంగా బలం, రెండు రాబోయే పలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. ఇక్కడ విజయం సాధిస్తే దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే తొలుత ఆపరేషన్ ఆకర్ష్‌ను గ్రేటర్ పరిధిలోని జిల్లాల్లో చేపట్టాలని యోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేస్తూ...తమ పార్టీలో చేరేందుకు గ్రేటర్‌లోని ముఖ్య నాయకులు టచ్‌లో ఉన్నారని, వీరిని రాకుండా వారివారి పార్టీల నేతలు అడ్డుకుంటున్నారని చెప్పడం గమనార్హం. సమయం వచ్చినప్పుడు వారిన తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని, అయితే తమ డోర్లు తెరిచే ఉన్నాయన్న సంకేతాలను వారికి ఇస్తున్నారు. దీనికి తోడూ అభయ్ పాటిల్ కూడా డోర్లను తెరిచామని మీడియాతో చెప్పడం వెనుకాల రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో టికెట్లు రాని నేతలు, పదవులు దక్కని కార్యకర్తలు, అసంతృప్తితో ఉన్న స్థానిక నాయకులను గుర్తించి వారిని కమలం గూటికి చేర్చేలా ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టనున్నారు. దీనిద్వారా ఒక్కసారిగా ఆ జిల్లాలో పార్టీకి బలం, ఓటుబ్యాంకు రెండూ వస్తాయని బీజేపీ లెక్క. ఈసారి లోక్‌సభ, అసెంబ్లీఎన్నికల్లోనూ గట్టిగా కొట్టాలని ఢిల్లీ వ్యూహం. ఇందుకు జాతీయస్థాయి నాయకులు తరచూ తెలంగాణ పర్యటన ప్లాన్ చేస్తున్నారు.






